KAISIKA DWADASI AND CHAKRA THEERTHA MUKKOTI ON NOV 24 _ నవంబరు 24న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి ఆస్థానం
TIRUMALA, 22 NOVEMBER 2023: The twin important religious events of Kaisika Dwadasi and Chakra Theertha Mukkoti will be observed in Tirumala on November 24.
On the occasion of Kaisika Dwadasi, the processional deities of Ugra Sreenivasamurty along with Consorts will take a celestial ride along four mada streets during the early hours of Friday between 4:45am and 5:45am.
On the other hand, Chakratheertha Mukkoti will be observed at one of the important sacred torrents at Chakra Theertham by TTD temple staff and religious persons.
Special pujas will be offered to Sri Sudarshana Chakrattalwar, Narasimha Swamy and Anjaneya Swamy located in this holy place.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
నవంబరు 24న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి ఆస్థానం
– చక్రతీర్థ ముక్కోటి
తిరుమల, 2023 నవంబరు 22: కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నవంబరు 24వ తేదీన శుక్రవారం శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానం జరుగనుంది. ఈ ఉత్సవ నేపథ్యంలో స్వామివారికి ప్రాతఃకాలంలో నిర్వహించే సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు, తెల్లవారుజామున 4.45 నుండి 5.45 గంటల లోపు తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఆలయం లోపల ఉదయం 6 నుండి ఉదయం 7.30 గంటల వరకు కైశికద్వాదశి ఆస్థానాన్ని పురాణపారాయణం ద్వారా ఘనంగా నిర్వహిస్తారు.
పురాణాల ప్రకారం కైశిక ద్వాదశిని ప్రబోధోత్సవం అని, ఉత్తానద్వాదశి అని కూడా వ్యవహరిస్తారు. వివిధ గ్రంథాల్లో పేర్కొన్న విధంగా స్థితికారుడైన శ్రీమహావిష్ణువును మేల్కొల్పే పర్వదినాన్ని కైశికద్వాదశిగా వ్యవహరిస్తారు. శ్రీమహావిష్ణువు ఆషాఢశుక్ల ఏకాదశినాడు గాఢ నిద్రలోకి వెళ్లారు. కైశికద్వాదశినాడు ఆయన్ను మేలుకొల్పడం రివాజు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైవున్న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి మహోత్సవాన్ని ప్రతిఏటా టీటీడీ ఘనంగా నిర్వహిస్తుంది.
పౌరాణిక నేపథ్యం..
కైశికద్వాదశి పౌరాణిక నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకుంది. శ్రీనంబదువాన్ అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను ప్రస్తుతం శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని, తప్పక తిరిగివచ్చి క్షుద్బాధను తీరుస్తానని నంబదువాన్ ప్రమాణం చేశాడు. అన్నమాట ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారట. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే పేరు వచ్చింది.
నవంబరు 24న చక్రతీర్థ ముక్కోటి
తిరుమలలో జరిగే అత్యంత ప్రముఖమైన ఉత్సవాలలో ఒక్కటైన చక్రతీర్థ ముక్కోటి నవంబరు 24న శుక్రవారం జరుగనుంది.
పౌరాణిక నేపథ్యంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసివున్న శేషగిరులపై దక్షిణభాగంలో మహా పవిత్రతీర్థమైన చక్రతీర్థం ఉంది. చక్రతీర్థ ముక్కోటి నాడు ఉదయం 9 గంటలకు అర్చకులు, పరిచారకులు మంగళవాయిద్యాలతో ఆలయం నుండి ప్రదక్షిణంగా చక్రతీర్థానికి వెళతారు. చక్రతీర్థంలో వెలసివున్న శ్రీ చక్రత్తాళ్వారువారికి, శ్రీ నరసింహస్వామివారికి, శ్రీ ఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం, పూజలు చేస్తారు. అనంతరం హారతి నివేదించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు.
స్కంద పురాణం ప్రకారం పద్మనాభ మహర్షి చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశారు. అందుకు సంతసించి శంఖచక్రగధాభూషితుడైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్థానమయ్యారు. స్వామి ఆజ్ఞానుసారం పద్మనాభ మహర్షి చక్రతీర్థంలో తపస్సు చేశారు. అయితే ఒకనాడు ఓ రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించారు. అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపి ఆ రాక్షసుని సంహరించారు. ఆ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉంచి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని మహర్షి కోరారు. భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండేలా ఆజ్ఞాపించడంతో ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది. వరాహ పురాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా ఉన్న సప్త తీర్థాలలో చక్ర తీర్థం ప్రముఖ తీర్థంగా వెలుగొందుతోంది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.