KALPAVRUKSHA VAHANAM _ కల్పవృక్ష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం
కల్పవృక్ష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం
తిరుపతి, మార్చి 14, 2013: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం ఉదయం కల్పవృక్ష వాహనంపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ఠీవీగా ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు.
ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని స్వామివారు అధిరోహించి నాలుగవ రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిస్తారు.
వాహన సేవ అనంతరం ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ రకాల పండ్ల రసాలతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. రాత్రి 8.30 నుండి 10.00 గంటల వరకు సర్వభూపాల వాహనంపై శ్రీ కోదండరామ స్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు.
సర్వభూపాలురు అంటే అందరు రాజులు అని అర్థం. ”రాజా ప్రజారంజనాత్” అన్నట్లు ప్రజలను రంజింపజేసేవారే రాజులు. ఈ రాజులందరికీ రాజాధిరాజు భగవంతుడు. అందుకే సర్వభూపాలురు వాహన స్థానీయులై భగవంతుని తమ భుజస్కంధాలపై ఉంచుకుని విహరింప చేస్తున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ మహతి కళాక్షేత్రంలో, శ్రీ రామచంద్ర పుష్కరిణి వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు శ్రీ కోదండరామాలయంలో శ్రీ జి.బి.నగేష్‌కుమార్ బృందం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో కడప సవేరా ఆర్ట్స్ వారి శ్రీరామ పట్టాభిషేకం పౌరాణిక పద్యనాటకం జరుగనుంది. అలాగే శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద శ్రీ హెచ్.ఎస్.బ్రహ్మానంద ”రామాయణ ఆవిర్భావం” అనే అంశంపై ఉపన్యసించనున్నారు.
ఈ కార్యక్రమంలో తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖరపిళ్లై, ఏఈఓ శ్రీ ప్రసాదమూర్తిరాజు, సూపరింటెండెంట్ శ్రీ సురేష్‌రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ఆంజనేయులు, శ్రీ శేషారెడ్డి, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.