LORD GOVINDA RAJU RIDES KALPAVRIKSHA_ కల్పవృక్ష వాహనంపై శ్రీగోవిందరాజస్వామివారి వైభవం

Tirupati, 24 May 2018: On the fourth day morning of ongoing annual Brahmotsavams of Lord Sri Govinda Raja Swamy in Tirupati, the devotees cherished the procession of Kalpavriksha Vahanam.

The processional deity of Lord accompanied by His two consorts on either side took celestial ride on the divine wish fulfilling tree with majesty.

The dance and bhajans by cultural troupes added extra spiritual fervour to the event.

Pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Sri Chinna Jeeyar Swamy, Local temples DyEO Smt Varalakshmi, AEO Sri Udayabhaskar Reddy, Supdt, Sri Jnana Prakash and other temple officials and devotees participated in the grand Brahmotsavam events through out the day.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కల్పవృక్ష వాహనంపై శ్రీగోవిందరాజస్వామివారి వైభవం

తిరుపతి, 2018 మే 24: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం గోవిందరాజస్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్ఠిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. ఇతర వృక్షాలు తమకు కాచిన ఫలాలను మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం వాంఛిత ఫలాలనన్నింటినీ ప్రసాదిస్తుంది. సముద్రమథనంలో సంకల్ప వృక్షంగా ఆవిర్భవించిన దేవతావృక్షం కల్పవృక్షం. భక్తుల కోరికలు ఈడేర్చే కోనేటిరాయుడు ఈ కల్పవృక్షాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు.

అనంతరం ఉదయం 9.30 నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరుగనుంది. రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు సర్వభూపాలవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

”రాజా ప్రజారంజనాత్‌” అన్నట్లు ప్రజలను రంజింపజేసేవారే రాజులు. అనంతవిశ్వానికి సర్వభూపాలుడు అయిన శ్రీ గోవిందరాజస్వామి కలియుగంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సర్వభూపాల వాహనాన్ని అధిరోహిస్తాడు. అంతేగాక పాలకుల అధికారి దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వారు భగవత్సేవాపరులు కావాలని సర్వభూపాల వాహనసేవ ద్వారా స్వామివారు దివ్యమైన సందేశాన్ని ఇస్తారు.

మే 25న గరుడసేవ :

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి 8 నుండి 10 గంటల వరకు గరుడసేవ వైభవంగా జరుగనుంది.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీజ్ఞానప్రకాష్‌ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం నిర్వహించిన ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు ఎస్‌.వి సంగీత, నృత్య కళాశాల వారిచే మంగళధ్వని నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి ఎస్‌కె.స్వర్ణకుమారి బృందం విష్ణుసహస్రనామ పారాయణం చేపట్టారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు పురాణ ప్రవచనం జరిగింది. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవలో ఎస్వీ సంగీత కళాశాల కళాకారులు భక్తి సంగీతం వినిపిస్తారు.

శ్రీగోవిందరాజస్వామి పుష్కరిణి వద్ద సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమం నిర్వహిస్తారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకురాలు శ్రీమతి చల్లా ప్రభావతి వయోలిన్‌ సోలో ప్రదర్శన ఇస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.