KOIL ALWAR TIRUMANJANAM PERFORMED AT SKVST_ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Srinivasa Mangapuram, 1 February 2018: The traditional temple cleansing ritual, koil alwar tirumanajanam was observed with religious fervour in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram on Thursday.

This ritual was performed in the wake of annual brahmotsavams which are set to commence from February 6 and conclude on February 14 with Ankurarpanam on February 5.

The Tirumanjanam was observed between 6am and 10:30am and the devotees are allowed for sarva darshan from 11:30am onwards.

Meanwhile a devotee, Sri Narasimhulu donated giant curtains-Paradas and Kuralams two each to the temple which will be used during brahmotsavams.

Temple DyEO Sri Venkataiah, AEO Sri Srinivasulu and other temple staff members also took part in this fete.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2018 ఫిబ్రవరి 01: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయంలో ఫిబ్రవరి 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే.

ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 6 నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఉదయం 11.30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలైన తిరుప్పావడసేవ, కల్యాణోత్సవం రద్దు చేశారు.

పరదాలు విరాళం :

తిరుపతికి చెందిన శ్రీ నరసింహులు రెండు పరదాలు, రెండు కురాళాలను ఆలయానికి విరాళంగా అందించారు. రానున్న బ్రహ్మోత్సవాల్లో వీటిని వినియోగించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీనివాసులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 5న అంకురార్పణ :

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు.

నాటి సిద్ధకూటమే నేటి శ్రీనివాసమంగాపురం :

క్రీ.శ 14వ శతాబ్దం నుండి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలు ప్రారంభమైనట్టు శాసనాధారాల ప్రకారం తెలుస్తోంది. క్రీ.శ 1433వ సంవత్సరంలో చంద్రగిరిని పాలించిన విజయనగర రాజుల వంశానికి చెందిన రెండవ దేవరాయ తిరుమలలో క్రమపద్ధతిలో వేదపారాయణం చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఇది బహుళ ప్రజాదరణ పొందింది. ఈ విషయాన్ని ఆలయాధికారి తెలుసుకుని సిద్ధకోట్టై అని పిలవబడే శ్రీనివాసపురానికి(ఇప్పుడు శ్రీనివాసమంగాపురం) చెందిన 24 మంది మహాజనులను స్వామివారి ఆస్థానంలో వేదాలను పారాయణం చేసేందుకు నియమించారు. దీనికి ఆమోదం తెలిపిన రాజుగారు ఇందుకయ్యే ఖర్చు కోసం తన రాజ్యపరిధిలోని సిద్ధకోట్టై గ్రామం నుండి రాజ్య భాండాగారానికి వచ్చే సొమ్ములో అర్ధ భాగాన్ని మంజూరు చేశారు.

అనంతరం శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల మనవడైన శ్రీ తాళ్లపాక చినతిరుమలాచార్యులు శ్రీకళ్యాణవేంకటేశ్వరుడి ఆలయానికి జీర్ణోద్ధరణ చేసి స్వామివారికి పూజలను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో క్రీ.శ 1540లో చంద్రగిరిని పాలించే అచ్యుతరాయలు మంగాపురం గ్రామాన్ని సర్వమాన్య అగ్రహారం(పన్నులేని భూమి)గా శ్రీ తాళ్లపాక చినతిరుమలాచార్యులకు అందజేశారు. ప్రకృతివైపరీత్యాలకు యవనుల దండయాత్రలకులోనై, శిథిలమైన ఈ గుడిని గోపురాలను పునర్‌నిర్మించి శ్రీ వేంకటేశ్వరస్వామికి నిత్య పూజా నైవేద్యాలను ఏర్పాటుచేసి ఉత్సవాలు ఊరేగింపులు చిన తిరుమలయ్య నిర్వహించినట్లు అప్పటి శాసనాలు చెబుతున్నాయి.

అర్చకులు శ్రీ సుందరరాజస్వామివారి నుంచి 1967వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని టిటిడి పరిధిలోకి తీసుకుంది. ఆలయాన్ని పునరుద్ధరించి దిట్టం ఏర్పరిచింది. 1981వ సంవత్సరం నుంచి స్వామివారి నిత్యకల్యాణం, సాక్షాత్కార వైభవోత్సవం, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. 2007, నవంబరులో ఆలయ మహాసంప్రోక్షణ జరిగింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.