LORD KALYANA VENKANNA RIDES ON SIMHA VAHANAM_ సింహ వాహనంపై యోగ నరసింహుని అవతారంలో కల్యాణ వెంకన్న

Tirupati, Feb: 8,2018: On Day 3 of the celestial annual Brahmotsavam at Sri Kalyana Venkateswara Temple of Srinivasa Mangapuram, Lord blessed devotees as he rode on Simha vahanam in the Yoga Narasimha avatar.

His vahanam went around four mada streets of the Srinivasa Mangapuram from morning 8am to 9am with his entourage of elephants and devotees performing chakka bhajans, Kolatas to the accompaniment of drums and holy music.

Devotees offered camphor harati at every step of the vahanam to beget his blessings in the unique avatar symbolizing the heralding of good and punishment of the bad elements in the society.

The lord will be offered Unjal seva in the evening and later Muthyapu pandiri vahana seva to bless the tumult of devotees who had gathered for the celestial darshan glittering with pearls, diamond, gold and flower decorations.

DyEO Sri Venkataiah, AEO Sri Srinivasulu, EE Sri Manohar, DyEE Sri Ramamurthy, Chief Kankana bhattar Sri Balaji Rangacharyulu, AE Sri Nagaraja, AVSO Sri Ganga Raju and others participated.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

సింహ వాహనంపై యోగ నరసింహుని అవతారంలో కల్యాణ వెంకన్న

తిరుపతి,2018 ఫిబ్రవరి 08: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగ నరసింహుని అవతారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహంపై కూర్చొని ఊరేగుతారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతాలవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారి నిరూపిస్తున్నారు.

కాగా సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళయే అనుకూలం. అందుకే కల్యాణ శ్రీనివాసునికి మూడో రోజు రాత్రి మొదటియామంలో ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్ని పెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. మాంసమయమైన ఈ శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణ చక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి మిక్కిలి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ వెంకటయ్య, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీనివాసులు, డిప్యూటి ఇఇ శ్రీ రామూర్తి, ప్రధాన కంకణబట్టార్‌ శ్రీ బాలాజీ రంగాచార్యులు, ఏఈ శ్రీ నాగరాజు, ఎవిఎస్వో శ్రీ గంగారాజు, ఇతర అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.