LORD SWINGS ON GAJA VAHANA SEVA_ గజ వాహనంపై శ్రీమన్నారాయణుడు కనువిందు

Tirumala, 28 September 2017: On the sixth day evening, the Lord Malayappa Swamy took celestial ride on the mighty Gaja Vahanam on Thursday.

Gaja-the Elephant king is symbol for its loftiness, royalty, pride and intelligence. According to Puranas, Gaja is a symbol of richness and is a sibling of Goddess Lakshmi, who is also the goddess of prosperity. It has been a tradition which is continuing even today where the Maharajas, temples showcase their richness with the elephant procession.

By taking a pleasure ride on Gaja Vahanam, Lord showcases His royalty and majesty.

TTD EO Sri Anil Kumar Singhal, JEOs Sri KS Sreenivasa Raju, Sri Pola Bhaskar, CVSO Sri Ake Ravikrishna, Temple DyEO Sri Rama Rao and others took part.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

గజ వాహనంపై శ్రీమన్నారాయణుడు కనువిందు

తిరుమల, 28 సెప్టెంబరు 2017: శ్రీవారి నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు గురువారం రాత్రి 9.00 నుండి 11.00 గంటల నడుమ వేంకటాద్రీశుడు గజవాహనంపై వచ్చి స్వామి భక్తుల మొరలాలకించి, కాపాడతాడు. ఇంటిముందు ఏనుగులగుంపులు బంగారు ఆభరణాలతో ప్రకాశిస్తూ ఉండడం – ఐశ్వర్యానికి పరాకాష్ఠ. రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాధిష్ఠితులను చేసి ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సివస్తే గజారోహణం కావించే ప్రక్రియ నేటికీ ఉన్నది. శ్రీవేంకటేశ్వరస్వామి గజవాహనారూఢుడై తిరువీథులలో తిరగడం భక్తులకు మరపురాని దృశ్యం. బ్రహ్మరథం వెనుక అశ్వాలు, వృషభాలతో ఠీవిగా ఈ గజాలు కూడా నడిచివస్తాయి. కనుక పట్టపుటేనుగుపై ఊరేగడం చక్రవర్తి లక్షణం. శ్రీవారు విశ్వ చక్రవర్తి కనుక – ఆవిషయాన్ని గుర్తుచేస్తూ – ఏనుగుపై ఊరేగింపుగా వస్తాడు.

‘గజం’ అనేపదం రాకపోకలుగల ప్రకృతికి సంకేతం. అంటే విశ్వానికి సంకేతం. విశ్వానికి అధిష్ఠానమూర్తి అయిన శ్రీనివాసుడు గజాన్ని అధిష్ఠించడం – జగత్తునూ, జగన్నాయకుణ్ణీ ఒకచోట దర్శించే మహాభాగ్యానికి చిహ్నం. గజరాజులు రోజూ శ్రీవారిసేవలో పాల్గొంటూనే ఉంటాయి. కానీ తమపై స్వామి అధిరోహించేదెప్పుడా అని ఎదురుచూస్తుంటాయి. ఆ గొప్పఅవకాశం బ్రహ్మోత్సవాలలో వాటికి లభిస్తుంది. తమజాతిలో ఏ ఒక్క ఏనుగుపై స్వామి అధిష్ఠించినా – ఆజాతికంతా సంతోషమే! పైగా స్వామి గజేంద్ర రక్షకుడు కనుక అందుకు కృతజ్ఞతగానూ, ఏనుగు స్వామికివాహనమై, స్వామివారిసేవలో ధన్యం కావడం మహాఫలంకదా!

ప్రత్యక్షంగా ఏనుగులు ముందుంటాయి. వాహనరూపమైన ఏనుగు పల్లకీలో ఉంటుంది. ఏవిధంగానైనా గజవాహనసేవ ప్రశస్తమైందే! శరణాగతికి గజేంద్రునిసేవ ఉదాహరణం.

భగవంతుడు ఆర్తత్రాణపరాయణుడు. భక్తితో ప్రార్థిస్తే తప్పకవచ్చి రక్షిస్తాడనే సంగతిని గజవాహనోత్సవం సూచిస్తూంది. అన్నీవదలి తననే శరణుకోరిన – గజేంద్రుణ్ణి రక్షించినట్లే మిమ్మల్నీ రక్షిస్తానని స్వామి అభయప్రదానం – గజవాహనసేవలో వ్యక్తమవుతుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.