MANUSCRIPTS ARE THE STANDING PROOF OF OUR GLORIOUS PAST-HON’BLE GOA GOVERNOR _ రాతప్రతులు ప్రాచీన భారత విజ్ఞాన భాండాగారాలు : గోవా గవర్నర్ శ్రీ భరత్ వీర్ వాంచూ
రాతప్రతులు ప్రాచీన భారత విజ్ఞాన భాండాగారాలు : గోవా గవర్నర్ శ్రీ భరత్ వీర్ వాంచూ
తిరుపతి, మార్చి 25, 2013: మన పూర్వీకులు అందించిన రాతప్రతులు ప్రాచీన భారత విజ్ఞాన భాండాగారాలని గోవా గవర్నర్ గౌ|| శ్రీ భరత్ వీర్ వాంచూ ఉద్ఘాటించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ”పురాతన రాతప్రతుల కూర్పు, ముద్రణ” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు సోమవారం ప్రారంభమైంది.
ఉదయం జరిగిన సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌ|| శ్రీ భరత్ వీర్ వాంచూ ప్రసంగిస్తూ పురాతన రాతప్రతులు ఆయా కాలాల నాటి మతపరమైన, ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్రను మన కళ్ల ముందు ఉంచుతాయన్నారు. చారిత్రక ప్రాధాన్యం గల వివిధ భాషల్లో లభ్యమైన ఈ రాతప్రతులను ఆయా రంగాల్లో నిష్ణాతులతో కూర్పు చేయించి ప్రచురించాలని సూచించారు. వీటిలో సాహిత్యం నుంచి గణితం వరకు అన్ని అంశాలు ఉన్నాయని, ఇవి సమాజాభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.
గౌరవ అతిథిగా హాజరైన తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ప్రసంగిస్తూ పురాతన రాతప్రతుల పరిష్కరణలో వేద విశ్వవిద్యాలయంలోని పరిశోధన మరియు ప్రచురణల విభాగం విశేష కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాతప్రతుల్లోని విజ్ఞానాన్ని భద్రపరిచి భావితరాలకు అందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిపారు. అప్పట్లో రుషులు, పండితులు దూరదృష్టితో ఆలోచించి ఎన్నో విలువైన అంశాలను రాతప్రతుల్లో భద్రపరచినట్టు వివరించారు.
హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్య రాతప్రతుల గ్రంథాలయం (ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓరియంటల్ మ్యానుస్క్రిప్ట్ లైబ్రరీ) సంచాలకులు ప్రొఫెసర్ శ్రీపాద సుబ్రమణ్యం కీలకోపన్యాసం చేశారు. రాతప్రతుల కూర్పు, ముద్రణ ఒక శాస్త్రానికి సంబంధించినది కాదని, అన్ని శాస్త్రాల్లో లోతైన అవగాహన ఉంటేనే ఇది సాధ్యమని వివరించారు. వివిధ భాషల్లో ఉన్న రాతప్రతుల్లో పదంలో ఒక్క అక్షరం తారుమారైనా అర్థం మారిపోతుందని తెలిపారు. వేద విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఈ ప్రక్రియకు తమ సంస్థ తరపున కావలిసిన అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
అనంతరం వేద విశ్వవిద్యాలయం ప్రచురించిన ”కర్మవిపాక”, ”సంస్కార నిర్ణయః”, ”పారస్కర గ్రహ్యసూత్రమ్” అనే గ్రంథాలను గవర్నర్ ఆవిష్కరించారు.
దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, వేద విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి ఉపకులపతి శ్రీ జి.గోపాల్ అధ్యక్షతన జరిగిన సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, వేద విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎ.విజయకుమార్, కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎ.వెంకటరాధేశ్యామ్, ఇతర వర్సిటీ అధికారులు, ఆచార్యులు, పండితులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
అనంతరం మొదటిరోజు సదస్సులో మూడు అంశాలపై నిష్ణాతులు ప్రసంగించారు. ఉదయం ప్రొఫెసర్ శ్రీపాద సుబ్రమణ్యం అధ్యక్షతన ”పేలియోగ్రఫిలో సమస్యలు” అనే అంశంపై ఉపన్యసించారు. మధ్యాహ్నం పాండిచ్చేరిలోని ఫ్రెంచి ఇనిస్టిట్యూట్ సీనియర్ పరిశోధకులు డాక్టర్ టి.గణేశన్ అధ్యక్షతన ”రాతప్రతుల సంరక్షణ” అనే అంశంపై, బెంగళూరులోని సి-డాక్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.రామానుజన్ ”సంస్కృత రాతప్రతుల కూర్పులో సమస్యలు” అనే అంశంపై ఉపన్యసించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.