ఆగస్టు 13 నుండి 15వ తేదీ వరకు తాళ్లపాక శ్రీ సిద్దేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు
ఆగస్టు 13 నుండి 15వ తేదీ వరకు తాళ్లపాక శ్రీ సిద్దేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు
తిరుపతి, 2017 ఆగస్టు 10: కడప జిల్లా తాళ్లపాకలోని శ్రీ సిద్దేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు ఆగస్టు 13 నుండి15వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 13వ తేదీ సాయంత్రం 5.00 గంటలకు అంకురార్పణం, యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, వాస్తుపూజ, వాస్తుహోమం నిర్వహిస్తారు. ఆగస్టు 14న పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఆగస్టు 15న యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, పవిత్రవితరణ, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగనున్నాయి. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథలు, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.