జూన్‌ 24 నుండి జూలై 3వ తేదీ వరకు శ్రీ పెరియాళ్వార్‌ ఉత్సవం

జూన్‌ 24 నుండి జూలై 3వ తేదీ వరకు శ్రీ పెరియాళ్వార్‌ ఉత్సవం

తిరుపతి, 2017 జూన్‌ 22: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీలక్ష్మీ నారాయణస్వామివారి ఆలయంలో జూన్‌ 24 నుండి జూలై 3వ తేదీ వరకు శ్రీ పెరియాళ్వార్‌ ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళ్లల్లో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌ స్వామి తమ శిష్యబృందంతో కలిసి శ్రీలక్ష్మీ నారాయణస్వామివారి ఆలయంలోని శ్రీ పెరియాళ్వార్‌వారి సన్నిధిలో ప్రబంధ పాశురాలను నివేదిస్తారు. చివరి రోజైన జూలై 3వ తేదీ ఉదయం శ్రీ పెరియాళ్వార్‌కు తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం శ్రీగోవిందరాజస్వామివారు గరుడ వాహనంపై, శ్రీ పెరియాళ్వార్‌ గజ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

శ్రీ మహావిష్ణువుకు పెరియాళ్వార్‌ పరమభక్తుడు. శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి ఈయన తండ్రి. శ్రీ పెరియాళ్వార్‌ తులసిమాలలు కట్టి ప్రతిరోజు స్వామివారికి సమర్పించేవారు. తండ్రితో పాటు ఆరాధించిన ఆండాళ్‌ అమ్మవారు చివరకు స్వామివారినే భర్తగా భావించారు. శ్రీ పెరియాళ్వార్‌ ఎన్నో పాశురాలను రచించి స్వామివారికి అర్పించారు. ఇయనకు శ్రీమహావిష్ణువు సాక్షాత్కారం జరిగినట్టు అర్చకులు తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.