PRASANNA VENKATESWARA MARCHES ON MAMMOTH CHARIOT_ వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడి రథోత్సవం

Appalayagunta, 20 Jun. 19: On day Eighth day morning on Thursday during the ongoing annual Brahmotsavams of Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta, the utsava deity of Lord mused his devouts on the sacred Ratham flanked by His two consorts on either sides.

The imperial parade on the Mada streets to the accompaniment of Bhakti bhajans, kolatas and devotees chanting Govinda, Govinda and dragging the divine Ratham was a cosmic spectacle for the devotees who gathered in large numbers.

Sri Prasanna Venkateswara was seated on the colourfully decorated wooden chariot during the fête, as devotees flocked to pull the rope of the mammoth chariot.

On the occasion, Tirumala Tirupati Devasthanams (TTD) made elaborate security arrangements with the help of police, ‘Srivari Sevakulu’ and vigilance sleuths to prevent any untoward incidents during the procession.

The chariot was tastefully decorated with different varieties of flowers, flags and festoons. The dance troupes added glamour to the procession.

TTD JEO Sri B Lakshmikantham, Temple DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, Superintendent Sri Gopala Krishna Reddy, and others were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడి రథోత్సవం

తిరుపతి, 2019 జూన్ 20: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన గురువారం ఉదయం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ‌నివాసుడు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9.15 గంటలకు మిథున‌ లగ్నంలో స్వామివారు రథారోహణం చేశారు. ఉదయం 9.30 నుండి 11.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజు ఉదయం రథోత్సవం జరుగుతుంది. శరీరం – రథం, ఆత్మ- రథికుడు, బుద్ధి – సారథి, మనస్సు – పగ్గాలు, ఇంద్రియాలు – గుర్రాలు. ఇంద్రియ విషయాలు రథం నడిచే త్రోవలు. రథం రథికుణ్ణి చూడమంటుంది. రథికుడు పగ్గాల సాయంతో గుర్రాలను అదిలిస్తూ, దారుల వెంబడి పరుగులు తీయించినట్లే ఇంద్రియాలతో, మనస్సుతో కూడిన ఆత్మవిషయాల్ని అనుభవిస్తూ ఉంటుంది. రథోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన స్వామివారి రథాన్ని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. రథస్తుడైన మాధవుడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదన్నారు పెద్దలు.

అనంతరం ఉదయం 11.30 నుండి 12.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు ఊంజల్‌సేవ ఘనంగా నిర్వహిస్తారు. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వస్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వ వాహనాధిరూఢడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండమని నామసంకీర్తనాద్యుపాయాలను ఆశ్రయించి తరించమని ప్రబోధిస్తున్నాడు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం దంప‌తులు, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణా, కంకణభట్టార్‌ శ్రీ సూర్యకుమార్‌ ఆచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

జూన్ 21న చక్రస్నానం :

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన శుక్ర‌వారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం 9.00 నుండి 10.15 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి, చక్రత్తాళ్వార్‌వారికి వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఉదయం 10.15 నుండి 10.30 గంటల వరకు ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో చక్రత్తాళ్వార్‌కు శాస్త్రోక్తంగా చక్రస్నానం జరుగనుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.