PREPARE STUDENTS FOR COMPETITIVE EXAMS,TTD JEO (H &E) _ విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలి :టిటిడి జెఈవో శ్రీమతి సదా భార్గవి
విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలి :
టిటిడి జెఈవో శ్రీమతి సదా భార్గవి
తిరుపతి, 2022 సెప్టెంబరు 17 ;టిటిడి జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులు మెడిసిన్, ఇంజినీరింగ్ తదితర పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించేలా పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జెఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు. అలాగే ఎస్వీ సంగీత, నృత్య కళాశాలను మ్యూజిక్ మ్యూజియంలా తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
తిరుపతిలోని పరిపాలనా భవనంలో శనివారం జెఈవో టిటిడి విద్యాసంస్థలకు చెందిన ప్రత్యేకాధికారులు, ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులతో విద్యాప్రమాణాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ విద్యాదాన ట్రస్టు ద్వారా కళాశాలలు, పాఠశాలల్లో విద్యాప్రమాణాలు ఎలా అభివృద్ధి చేయవచ్చో ఆలోచించాలన్నారు. విద్యాసంస్థల్లో అధ్యాపకులు, ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని మౌళిక సదుపాయాల కల్పనకు కూడా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎస్‌పిడబ్ల్యు, ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలకు న్యాక్ ఎ ప్లస్ గ్రేడ్ రావడానికి వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపామని, ఇకపై జూనియర్ కళాశాలల్లో కూడా మరింత మెరుగైన విద్యాప్రమాణాలు, వసతులు కల్పించడానికి ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని చెప్పారు.
విద్యాసంస్థల్లోని గ్రంథాలయాల్లో విద్యార్థులకు అవసరమయ్యే అన్ని పుస్తకాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో మెడిసిన్, ఇంజినీరింగ్ సీట్లు సాధించాలనే ఆసక్తి ఉన్నవారికి తగిన శిక్షణ ఇచ్చి వారాంతపు పరీక్షలు నిర్వహించాలన్నారు. నీట్, జెఇఇ, ఎంసెట్ లాంటి పోటీ పరీక్షలకు నిష్ణాతులతో శిక్షణ ఇప్పించాలన్నారు. అలాగే, కామర్స్, ఎకనామిక్స్ విద్యార్థులు కూడా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వాలన్నారు. అధ్యాపకులు, ఉపాధ్యాయులు తరచూ విద్యార్థులతోను, వారి తల్లిదండ్రులతోను సమావేశాలు నిర్వహించాలని సూచించారు. విద్యాబోధనకు సంబంధించి విద్యార్థుల నుంచి అభిప్రాయ సేకరణ జరపాలన్నారు.
పరీక్షల ముందు విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉండేలా ప్రేరణ తరగతులు నిర్వహించాలన్నారు. కళాశాల, పాఠశాలల ఆవరణాలతోపాటు తరగతి గదులు, హాస్టళ్లలోని వంటశాలలు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సంగీత, నృత్య కళాశాలలో ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారి జీవితచరిత్రలు తెలియజేసేలా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. శిల్పకళాశాల విద్యార్థులతో లేపాక్షి తరహాలో ఉత్పత్తులు తయారు చేయించి వాటి విక్రయాలకు ఔట్లెట్ ఏర్పాటుచేసే ప్రతిపాదనను పరిశీలించాలన్నారు. తాటితోపులోని పాఠశాలను మోడల్ స్కూల్‌గా తయారు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. బదిర పాఠశాలలు, కళాశాలలో సలహామండళ్లు ఏర్పాటుచేసి అభివృద్ధి అంశాలపై చర్చించాలని జెఈవో సూచించారు. విద్యాసంస్థల్లో ప్రతి విద్యార్థి ఆరోగ్యం, ప్రోగ్రెస్ కార్డుల డేటా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో టిటిడి డిఇవో శ్రీ గోవిందరాజన్, విద్యాసంస్థల ప్రత్యేకాధికారులు శ్రీ రవిప్రసాదు, శ్రీ శేషశైలేంద్ర, శ్రీమతి ప్రశాంతి, శ్రీమతి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.