జనవరి 16, 17వ తేదీల్లో పురందరదాసుల అరాధన మహోత్సవాలు

జనవరి 16, 17వ తేదీల్లో పురందరదాసుల అరాధన మహోత్సవాలు

తిరుమల, 2018 జనవరి 14: కర్ణాటక సంగీత పితామహులుగా ప్రసిద్ధిగాంచిన శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవాలు జనవరి 16, 17వ తేదీల్లో తిరుపతి, తిరుమలలో ఘనంగా జరుగనున్నాయి. టిటిడి దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

జనవరి 16, 17వ తేదీల్లో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు హరిదాస రంజని కళాకారులతో సంగీత కార్యక్రమాలు, పండితులతో ధార్మిక ఉపన్యాసాలు నిర్వహిస్తారు. జనవరి 16న అలిపిరిలోని పురందరదాసుల విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు.

జనవరి 16న తిరుమలలోని ఆస్థానమండపంలో ఉదయం భజన కార్యక్రమాలు, పురందర సాహిత్య గోష్ఠి, ప్రముఖ పీఠాధిపతుల మంగళాశాసనాలు, మధ్యాహ్నం శ్రీపురందర సంకీర్తనమాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేస్తారు. అక్కడ పురందరదాసుల సంకీర్తన కార్యక్రమం చేపడతారు.

జనవరి 17న హరిదాస రసరంజని పేరుతో దాస పదాలపై ప్రత్యేక సంకీర్తన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలను దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు పర్యవేక్షిస్తున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.