RAJAMANNAR LEADS THE SHOW ON FOURTH DAY_ కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్‌ అలంకారంలో శ్రీనివాసుడి వైభవం

Srinivasa Mangapuram, 27 February 2019: On the fourth day morning as a part of ongoing annual brahmotsavams in Srinivasa Mangapuram, Lord in the guise of Rajamannar took celestial ride on Kalpavriksha Vahanam on Wednesday.

Flanked by his two consorts Sridevi and Bhudevi, Lord proceeded along the.four mada streets encircling the shrine.

Kalpavriksha is the divine boon fulfilling tree which emerged out of Samudra Madhanam. The Lord sends a message to His devotees that he will fulfill the boons of His devotees if they surrender to Him without selfish intentions.

Tirupati JEO Sri B Lakshmikantham, Temple DyEO Sri Dhananjeyulu, AEO Sri Lakshmaiah, Superintendent Chengalrayulu and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్‌ అలంకారంలో శ్రీనివాసుడి వైభవం

తిరుపతి, 2019 ఫిబ్రవరి 27: శ్రీనివాసమంగపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధ‌వారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజగోపాలస్వామివారి అలంకారంలో చంద్రకోలు, దండం దరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తూ కల్పవృక్షం ఇవ్వలేని ధర్మమోక్షాల్ని కూడా నేను అనుగ్రహిస్తానని నిరూపిస్తున్నారు. కల్పవృక్షాలు లోకాతీతమైన ఏ ఫలాన్నయినా ఇస్తాయి. ఇవి కోరుకునేవారి తెలివిని బట్టి లభిస్తాయి. ఈనాటి వాహనమైన కల్పవృక్షం ఐదు కల్పవృక్షాల ఏకరూపం. అన్ని కల్పవృక్షాలిచ్చే ఫలాలూ శ్రీవారే ఇస్తారు. శ్రీదేవి, భూదేవి ఇహలోక ఫలాలిస్తారు. శ్రీవారు దివ్యలోకఫలాలు, ముక్తిని ప్రసాదిస్తారు. కనుక కల్పవృక్ష వాహనోత్సవ సేవ ఇహపరఫల ఆనందదాయకం.

కాగా సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు సర్వభూపాలవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

నాలుగవ నాటి రాత్రి సమస్త రాజ లాంఛనాలతో సర్వభూపాల వాహనసేవ అద్భుతంగా ఉంటుంది. భూమిని పాలించేవాడు భూపాలుడు. సమస్త విశ్వంలో లెక్కలేనన్ని సూర్యమండలాలున్నాయి. అన్ని సూర్య మండలాల్లోనూ భూమి ఉంది. ఆ భూగ్రహాలన్నింటినీ పాలించడం సర్వభూపాలత్వం. నైసర్గిక సరిహద్దులు గల కొంత భూమిపై అధికారం కలిగిన వ్యక్తి భూపాలకుడంటున్నాం. ఇలాంటి భూపాలురందరూ బ్రహ్మోత్సవాలకు తరలివస్తారు. మా ఏలుబడిలోని భూమిని కల్యాణాత్మకం చేసి రక్షించండని శ్రీవారిని ప్రార్థిస్తారు. ఇదొక విశిష్టసేవ. ఈ సేవ కోసం అందరూ ఐకమత్యంతో, భక్తిపూర్ణహృదయంతో, శరణాగతులై తామే జగత్‌ కల్యాణమూర్తికి వాహనమైపోతారు. అలా వాహనాలుగా మారిన చక్రవర్తుల భుజస్కంధాలపై కల్యాణమూర్తి ఊరేగడమే సర్వభూపాల వాహనసేవ.

ఈ కార్యక్రమంలో టిటిడి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ల‌క్ష్మ‌య్య‌, ప్రధాన కంకణబట్టార్‌ శ్రీ బాలాజీ రంగాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

కల్పవృక్షవాహ‌నసేవ‌లో మూడు ఆధ్యాత్మిక పుస్త‌కాల ఆవిష్క‌ర‌ణ

శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధ‌వారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజగోపాలస్వామివారి అలంకారంలో చంద్రకోలు, దండం దరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. ఈ సంద‌ర్భంగా టిటిడి ప్ర‌చుర‌ణ‌ల విభాగం ఆధ్వ‌ర్యంలో ముద్రించిన ప్రాచీనాంధ్రసాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు, రామానుజాచార్య అండ్‌ హిస్‌ మానేజ్‌మెంట్‌ (ఇంగ్లీష్‌), సంస్కృతనాటక పంచరత్నాలు పుస్త‌కాల‌ను టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం ఆవిష్క‌రించారు. అనంత‌రం రచ‌యిత‌ల‌ను శాలువ‌తో స‌న్మానించి శ్రీ‌వారి ప్ర‌సాదం అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక ఆల‌యాల డెప్యూటీ ఈవో శ్రీ ధ‌నంజ‌యులు, టిటిడి ప్ర‌చుర‌ణ‌ల విభాగం ప్ర‌త్యేకాధికారి డా.. తాళ్లూరు ఆంజ‌నేయులు, ఉప‌సంపాద‌కుడు డా.. నొస్సం న‌ర‌సింహాచార్య పాల్గొన్నారు.

ప్రాచీనాంధ్రసాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు అనే పుస్త‌కాన్ని డా|| కె.వి.రాఘవాచార్య ర‌చించారు. కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వారిని గురించి వేదాలు,పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు స్తుతిస్తున్నాయి.స్వామివారి ప్రస్తావన ప్రాచీన అర్వాచీన భారతీయ సాహిత్యంలో విస్తృతంగా ఉంది. శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రస్తావన ఉన్న సాహిత్యాన్నంతా ఒకచోటికి చేర్చి శ్రీవేంకటేశ్వరాంధ్ర సాహిత్య సర్వస్వం అనే పేరున 5 సంపుటాలలో రూపొందిస్తున్నది. అందులో భాగమే ఈ ప్రాచీనాంధ్రసాహిత్యంలో శ్రీవేంకటేశ్వరుడు. క్రీ.శ. 14వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం దాకా వచ్చిన ఆంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రస్తావన ఉన్నఅంశాలన్నిటిని పరిశోధించి సేకరించి గ్రంథస్తం చేసి ”ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీవేంకటేశ్వరడు” అనే పేరుతో అందించారు.

రామానుజాచార్య అండ్‌ హిస్‌ మానేజ్‌మెంట్ (ఇంగ్లీష్‌) అనే పుస్త‌కాన్ని శ్రీ కె.ఎస్‌.మోహన్‌ కుమార్ ర‌చించారు. హైందవ ధర్మాన్ని సుసంపన్నంచేసిన మహనీయులు త్రిమతాచార్యులు. ఆదిశంకరులు, రామానుజులు, మధ్వాచార్యుల వీరిలో విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించి సర్వమానవ సమానత్వాన్ని చాటి అష్టాక్షరీ మంత్ర రహస్యాన్ని బహిర్గతం చేసిన వారు భగవద్రామానుజాచార్యులు. శ్రీమద్రామానుజులవారు ఉపన్యాసాల ద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తమ శిష్యులకు తెలియజేశారు. ఈ ఉపన్యాసాల సారమే ”రామానుజ అండ్‌ హిస్‌ మేనేజ్‌మెంట్‌ ”. ఈ గ్రంథ రచయిత శ్రీ కె.ఎస్‌.మోహన్‌ కుమార్‌ రామానుజుల ఉపన్యాసాలు ప్రస్తుత యాంత్రిక సమాజంలో సుఖమయ జీవనానికి ఎలా తోడ్పడతాయో సోదాహరణంగా వివరించారు.

సంస్కృతనాటక పంచరత్నాలు అనే పుస్త‌కాన్నిడాక్టర్‌ రామవరపు శరత్‌బాబు ర‌చించారు. ‘కావ్యేషు నాటకం రమ్యమ్‌’ సాహిత్యజగత్తులో దృశ్యకావ్యం మనోహరం. సంస్కృతభాషలో రచింపబడిన నాటకాలలో ప్రధానం అనదగినవీ, ప్రసిద్ధమైనవీ, కాళిదాసమహాకవి రచించిన అభిజ్ఞానశాకుంతలం, భవభూతిమహాకవి వ్రాసిన ఉత్తరరామచరితం, శూద్రకమహాకవి వ్రాసిన మృచ్ఛకటికం, విశాఖదత్తమహాకవి ముద్రారాక్షసం, భట్టనారాయణమహాకవి విరచిత వేణీసంహారం అనే ఐదు నాటకాలు. ఈ నాటక పంచరత్నాలను తెలుగులో సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చే సంకల్పంతో ‘సంస్కృత నాటక పంచరత్నాలు’ అనే పేరున తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.