RAMAKOTI AND VASTRA DANAM FROM PILGRIMS DURING KRT BRAHMOTSAVAMS-TTD EO _ శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలపై తితిదే ఈవో సమీక్ష
శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలపై తితిదే ఈవో సమీక్ష
తిరుపతి, మార్చి 4, 2013: మార్చి 11 నుండి 19వ తేదీ వరకు జరుగనున్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం సోమవారం శ్రీ పద్మావతి అతిథిగృహంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో కవిసమ్మేళనం నిర్వహించాలని, భక్తుల చేత రామకోటి రాయించాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు తితిదే పుస్తక ప్రసాదం పంపిణీ చేయాలని కోరారు. రామాయణంపై స్పృహ కల్పించేలా ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కావ్యపఠనానికి ఏర్పాట్లు చేయాలని, విద్యార్థినీ విద్యార్థులతో అందులోని పాత్రలతో వేషధారణ చేయించాలని, పిల్లలకు ఆసక్తి పెంచేందుకు తోలుబొమ్మలాట ఏర్పాటుచేయాలని సూచించారు. ఈసారి బ్రహ్మోత్సవాల్లోనూ గృహస్తుల నుండి వస్త్ర బహుమానం స్వీకరించాలని, చతుర్వేద పారాయణం నిర్వహించాలని ఆదేశించారు.
శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణాలు, గోవింద కల్యాణాలు జరిగే సమయంలో భక్తుల చేత రామకోటి రాయించాలని ఈవో సూచించారు. ఇప్పటివరకు రాసిన రామకోటి పుస్తకాలను బ్రహ్మోత్సవాల అనంతరం భద్రాచలంలోని రామస్తూపంలో సమర్పించాలన్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పౌరాణిక నాటకాలు, శతకాలు, రామసంకీర్తన లాంటి కార్యక్రమాలు ప్రతిరోజూ నిర్వహించాలని ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేయాలని తితిదే ఆరోగ్యశాఖాధికారులను కోరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్, బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను కోరారు.
ఈ సమావేశంలో తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్, ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖర్‌పిళ్లై, తిరుపతి ఆర్డీవో శ్రీ రామచంద్రారెడ్డి, డీఎస్పీ శ్రీ బాబు, ఇతర పోలీసు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు
తేదీ ఉదయం సాయంత్రం
11-03-13(సోమవారం) ధ్వజారోహణం(వృషభలగ్నం) పెద్దశేష వాహనం
12-03-13(మంగళవారం) చిన్నశేష వాహనం హంస వాహనం
13-03-13(బుధవారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
14-03-13(గురువారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
15-03-13(శుక్రవారం) పల్లకీ ఉత్సవం గరుడ వాహనం
16-03-13(శనివారం) హనుమంత వాహనం గజ వాహనం
17-03-13(ఆదివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
18-03-13(సోమవారం) రథోత్సవం అశ్వవాహనం
19-03-13(మంగళవారం) చక్రస్నానం ధ్వజావరోహణం
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.