GOVINDA RADHA ROHANAM PROVIDES VISUAL TREAT TO DENIZENS OF TIRUPATI_ వైభవంగా గోవిందుడి రథోత్సవం
Tirupati, 28 May 2018: Among the Brahmotsava Vahana sevas of Sri Govinda Raja Swamy temple in Tirupati, the procession of wooden chariot happens to be the most important event after Garuda Seva.
The Radhotsavam happens to be the lengthiest one as it covers many important streets surrounding the temple in the temple city. The Radharohanam for the event was performed in the auspicious muhurat between 2:45am to 3:15am. Later the procession was observed from 7am on wards covering Beri, Karnala and Gandhi roads of Tirupati.
The devotees and denizens thronged to catch the glimpse of Lord on the mighty ratham chanting Govinda nama.
Meanwhile the annual brahmotsavams will conclude with Chakrasnanam on Tuesday.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా గోవిందుడి రథోత్సవం
మే 28, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 2.45 నుండి 3.15 గంటల వరకు మీన లగ్నంలో స్వామివారు రథారోహణం చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీరోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. భక్తులు అడుగడుగునా టెంకాయలు కొట్టి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు.
రథంపై భక్తులు ఉప్పు, మిరియాలు చల్లడం ఆనవాయితీ. ఈసారి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఉప్పు, మిరియాలు కలిపి స్వామివారి రథంపై చల్లారు. స్వామివారి రథం చక్రాల కింద పడి నలిగిన ఈ ఉప్పు, మిరియాలను భక్తులు పవిత్రంగా భావించి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇలా నలిగిన ఉప్పు, మిరియాలను తింటే శరీరంలోని రుగ్మతలన్నీ హరించుకుపోతాయని అర్చకులు తెలిపారు. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే.
అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు శ్రీవారికి, నమ్మాళ్వార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్వామివారికి ఊంజల్‌సేవ జరగనుంది. రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వస్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వ వాహనాధిరూఢుడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామసంకీర్తనాద్యుపాయాలను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు.
మే 29న చక్రస్నానం :
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 29వ తేదీన మంగళవారం ఉదయం 6 నుండి 10 గంటల వరకు శ్రీ కపిలేశ్వరాలయంలోని ఆళ్వార్ తీర్థంలో స్నపనతిరుమంజనం, చక్రస్నానం జరుగనుంది.
ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ ఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీజ్ఞానప్రకాష్ ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం నిర్వహించిన ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు ఎస్.వి సంగీత, నృత్య కళాశాల వారిచే మంగళధ్వని నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి ఎస్‌కె.స్వర్ణకుమారి బృందం విష్ణుసహస్రనామ పారాయణం చేపట్టారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు పురాణ ప్రవచనం జరిగింది. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవలో టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంగీతం వినిపిస్తారు.
శ్రీ గోవిందరాజస్వామి పుష్కరిణి వద్ద సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ధార్మికోపన్యాసం నిర్వహిస్తారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు వెంకటగిరికి చెందిన శ్రీసి.హెచ్.సాయిబాబ ధార్మికోపన్యాసం చేస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.