శిల్పారామంలో ఆకట్టుకున్న శ్రీమతి కొత్త ప్రవీణ కూచిపూడి నృత్యం


ISSUED BY TTDs,PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుపతి‌, 17 నవంబ‌రు 2017; శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూెత్సవాల సందర్భంగా శుక్రవారం సాయంత్రం తిరుచానూరు రోడ్డులోనీ శిల్పారామంలో పిఠాపురానికి చెందిన శ్రీమతి కొత్త ప్రవీణ కూచిపూడి నృత్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.

బ్రహ్మూెత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు, ఎస్వీ సంగీత న త్య కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.

ఇందులో భాగంగా శిల్పారామంలోని సాంస్కృతిక కళావేదికపై కూచిపూడి నృత్య ప్రదర్శన రమ్యంగా సాగింది. ఇందులో ‘అలరులు కురియగ ఆడినదే….’, ‘పలుకుతేనెల తల్లి పవళించెను….’, ‘కులుకక నడవరో కొమ్మలాల….’, ‘తందనాన అహి ….’, ‘జయజయరామ సమరవిజయ రామ…’ , జగడపు చనవుల జాజర… తదితర అన్నమయ్య సంకీర్తనలకు కొత్త ప్రవీణ, ఇతర చిన్నారులు చక్కటి నృత్యాభినయాన్ని ప్రదర్శించారు. వీరికి గాత్రం శ్రీమతి ఉపద్రష్ట సుజాత, నట్టువాంగంపై కొత్త ప్రవీణ,వయోలిన్ పై జి.చక్రపాణి, తబలాపై కె.గోపాల్ సహకారం అందించారు.

ఇదిలా ఉండగా ఆస్థానమండపంలో ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు ఎస్‌.వి.సంగీత కళాశాల అధ్యాపకులతో మంగళధ్వని, ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు ధర్మగిరిలోని శ్రీవేంకటేశ్వర వేదపాఠశాల ఆధ్వర్యంలో వేద పారాయణం నిర్వహించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు తిరుపతి కి చెందిన శ్రీ అజయ్ ధార్మికోపన్యాసం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తిరుపతికి చెందిన జి.మధుసూదనరావు, బి.రఘునాథ్ బృందం భక్తి సంగీతం, మధ్యాహ్నం వినుకొండకు చెందిన డి.శివరామకృష్ణ, హరికథ, సాయంత్రం అన్నమయ్య విన్నపాలు, ఊంజల్ సేవలో హైదరాబాద్ కు చెందిన శ్రీ మతి జ్యోత్స్నలక్ష్మి బృందం సంకీర్తనాలాపన చేపట్టారు.

అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు కడపకు చెందిన సవేరా ఆర్ట్స్ వారి శ్రీనివాస కల్యాణం పౌరాణిక నాటకం అలరించింది.

అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు కడపకు చెందిన టేకి భాగ్యలక్ష్మి బృందం భక్తి సంగీతం, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు విజయవాడ కు చెందిన శ్రీ భాగవతుల శ్రీనవాసశర్మ బృందం నృత్య ప్రదర్శన ఇచ్చారు.

టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయ‌డ‌మైన‌ది.