LORD RIDES ON SIMHA VAHANAM_ సింహ వాహనంపై అనంతతేజోమూర్తి

Tirupati, 23 May 2018: On the third day of the ongoing annual Brahmotsavam of TTD sub temple Sri Gvoindaraja Temple Lord decorated as AnantaJaimurti rode on Simha vahanam acoompanied by caparisoned elephants, kolatas, bhakti music of devotees.

Emerging as king of all animals, Lion (Simha) Lord symbolised as the strength of the weakest among devotees .The Snapana Tirumanjanam was performed to dieties in the morning and later in evening Unjal seva was performed. The utsava idols were paraded on Muthyapu pandiri vahanam at night.

During the Brahmotsavam the Lord appeared in various avatars with glittering flower, jewellery and silk robes every day.

Pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swami, Sri Sri Sri Chinna Jeeyar Swami , local temples Dy EO Smt Varalakshmi, AEO Sri Udayabhaskar Reddy, Supdt, Sri Jnana Prakash and other temple officials and devotees participated in the grand Brahmotsavam events through out the day.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సింహ వాహనంపై అనంతతేజోమూర్తి

తిరుపతి, 2018 మే 23: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం ఉదయం అనంతతేజోమూర్తి గోవిందరాజస్వామి సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

మృగాల్లో రారాజు సింహం. గాంభీర్యానికి చిహ్నం సింహం. యోగశాస్త్రంలో సింహం వాహనశక్తికి, శీఘ్రగమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు. అనంతతేజోమూర్తి శ్రీనివాసుడు రాక్షసుల మనసులలో సింహంలా గోచరిస్తాడని స్తోత్రవాఙ్మయం కీర్తిస్తోంది. అందుకే ధీరోదాత్తుడైన శ్రీ వేంకటేశ్వరుడు సింహవాహనాన్ని అధిరోహిస్తాడు.

అనంతరం ఉదయం 9.30 గంటల నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

నిత్య అలంకార ప్రియుడైన శ్రీవారు ఒక్కొక్కరోజు ఒక్కొక్క వస్త్రాభరణ అలంకారంలో దేదీప్యమానంగా వెలిగిపోతుంటాడు. ప్రత్యేకంగా మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ముత్యపుపందిరిపై భక్తులను చల్లగా ఆశీర్వదిస్తాడు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను ప్రశంసిస్తోంది. సముద్రం మనకు ప్రసాదించిన మేలివస్తువులలో ముత్యం ఒకటి. చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుందనడంలో సందేహం లేదు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీజ్ఞానప్రకాష్‌ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు సాంస్కృతికశోభ

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మూెత్సవాల సందర్భంగా బుధవారం నిర్వహించిన ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.

శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు ఎస్‌.వి సంగీత, నృత్య కళాశాల వారిచే మంగళధ్వని నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి డి.శ్రీవాణి బృందం విష్ణుసహస్రనామ పారాయణం చేపట్టారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు పురాణ ప్రవచనం జరిగింది. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవలో దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంగీతం వినిపిస్తారు.

శ్రీగోవిందరాజస్వామి పుష్కరిణి వద్ద సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు కాకినాడకు చెందిన శ్రీమతి తోట తులసి బృందం తోలుబొమ్మలాట నిర్వహిస్తారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ టి.శ్రీకీర్తన్‌ బృందం భక్తిసంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.