SKVST CLEANSED WITH “PARIMALAM” _ శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వమివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, 27June 2017: As a prelude to Sakshatkara Vaibhavotsavams from June 28, the holy event of Koil alwar Tirumanjanam was performed in the Sri Kalyana Venkateswara swamy temple at Srinivasa Mangapuram on Tuesday with the sacred mixture “Parimalam” which is smeared in the entire precincts of temple and sanctum sanctorum.

The celestial event of this traditional temple cleansing activity began after completion of the Suprabhata seva, Tomala seva and Panchanga sravanam. The Tirumanjanam (holy cleaning of the temple with traditional herbals and disinfectants) commenced at 6am and lasted upto 10.30am and darshan commenced from 11am to pilgrims.

Meanwhile the Sakshatkara Vaibhavotsavams will be observed for three days from June 28-30 and Paruveta Utsavam on July 1. The temple officials have cancelled arjitha sevas during these days.

Significance: As per temple legend, the temple rituals commenced in this ancient temple by Sri Tallapaka China Tirumalacharya, the grand son of Saint Poet Sri Tallapaka Annamacharya in 17th Century after performing Jeernodharana. However after many foreign invasions the temple lost its charm. In 1940 Lord Kalyana Venkateswara has come in the dream of a devotee Sri Soundar Rajan and told him to bring past glory to the temple by reinstating all rituals. Later the rituals began to Lord with the help of the local villagers on July 11 in 1940, which happened to be the first day in Ashadha month then. This day is being observed as “Srivari Sakshatkara Vaibhavam” since then.

TTD has been observing this fete as a three day religious ceremony in a big way since some years.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వమివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2017 జూన్‌ 27 : శ్ శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్‌ 28 నుండి సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం 4.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఉదయం 12.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు.

ఆలయంలో కోయల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా మంగళవారం స్వర్ణపుష్పార్చనసేవ, కళ్యాణోత్సవ సేవలను టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ వెంకటయ్య, ఏఈవో శ్రీ ధనంజయ, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

జూన్‌ 28నుండి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరము ఆషాడ మాసంలో వచ్చే ఉత్తర ఫల్గుణి నక్షత్రానికి నిర్వహించే శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు జూన్‌ 28 నుండి 30వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయ.

కార్యక్రమంలో భాగంగా జూన్‌ 28వ తేదీ ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌ సేవ, రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం జరుపుతారు.

జూన్‌ 29న ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌ సేవ, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు హనుమంత వాహనసేవ నిర్వహిస్తారు.

అలాగే మూడో రోజైన జూన్‌ 30వ తేదీన ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌ సేవ, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు గరుడ సేవ నిర్వహిస్తారు.

జూలై 1న పార్వేట ఉత్సవం :

శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాల మరుసటి రోజైన జూలై 1వ తేదీన పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీవారిమెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 7.00 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆస్థానం, పార్వేట ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు.

పలు ఆర్జిత సేవలు రద్దు :

ఈ సందర్భంగా జూన్‌ 28 నుండి జూలై 1వ తేదీ వరకు ఆర్జిత కళ్యాణోత్సవం, 28వ తేదీ అష్టోత్తర శతకళశాభిషేకం, జూన్‌ 29వ తేదీ తిరుప్పావడ సేవలను టిటిడి రద్దు చేసింది. అదేవిధంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్తు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

చారిత్రక ప్రాశస్త్యం :

క్రీ.శ 14వ శతాబ్దం నుండి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలు ప్రారంభమైనట్టు శాసనాధారాల ప్రకారం తెలుస్తోంది. క్రీ.శ 1433వ సంవత్సరంలో చంద్రగిరిని పాలించిన విజయనగర రాజుల వంశానికి చెందిన రెండవ దేవరాయ తిరుమలలో క్రమపద్ధతిలో వేదపారాయణం చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఇది బహుళ ప్రజాదరణ పొందింది. ఈ విషయాన్ని ఆలయాధికారి తెలుసుకుని సిద్ధకోట్టై అని పిలవబడే శ్రీనివాసపురానికి(ఇప్పుడు శ్రీనివాసమంగాపురం) చెందిన 24 మంది మహాజనులను స్వామివారి ఆస్థానంలో వేదాలను పారాయణం చేసేందుకు నియమించారు. దీనికి ఆమోదం తెలిపిన రాజుగారు ఇందుకయ్యే ఖర్చు కోసం తన రాజ్య పరిధిలోని సిద్ధకోట్టై గ్రామం నుండి రాజ్య భాండాగారానికి వచ్చే సొమ్ములో అర్ధ భాగాన్ని మంజూరు చేశారు.

అనంతరం శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల మనవడైన శ్రీ తాళ్లపాక చినతిరుమలాచార్యులు శ్రీకళ్యాణ వేంకటేశ్వరుడి ఆలయానికి జీర్ణోద్ధరణ చేసి స్వామివారికి పూజలను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో క్రీ.శ 1540లో చంద్రగిరిని పాలించే అచ్యుతరాయలు మంగాపురం గ్రామాన్ని సర్వమాన్య అగ్రహారం(పన్నులేని భూమి)గా శ్రీ తాళ్లపాక చినతిరుమలాచార్యులకు అందజేశారు.

అనంతరం క్రీ.శ 1780లో అన్యమత రాజులు ఈ ఆలయాన్ని లూటీ చేశారు. ఆలయ ప్రధానరాజగోపురం, గర్భాలయ గోపురం, విగ్రహాలను పూర్తిగా ధ్వంసం చేశారు. పాక్షికంగా ధ్వంసమైన కొన్ని విగ్రహాలు ప్రస్తుతం చంద్రగిరికోటలో భారత ప్రభుత్వ పురావస్తు శాఖ సంరక్షణలో ఉన్నాయి. 1920వ సంవత్సరంలో బ్రిటీషు ప్రభుత్వం ఈ ఆలయాన్ని జాతీయ పురాతన కట్టడంగా గుర్తించి పురావస్తు శాఖ పరిధిలోకి తెచ్చింది. ఈ ఆలయం భారత ప్రభుత్వ పురావస్తు శాఖ రక్షిత కట్టడాల జాబితాలో ఉంది.

అనంతరం 1940వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం కాంచీపురానికి చెందిన మధ్వ బ్రాహ్మణుడు సుందరరాజ మంగాపురానికి వచ్చి శ్రీనివాసుడు తనకు కలలో కనిపించాడని తెలిపారు. ”శ్రీనివాసమంగాపురంలో ఉన్న నాకు ధూపదీప నైవేద్యాలు కరువయ్యాయి. నా ఆలయానికి పూర్వ వైభవం కల్పించు” అని స్వామి ఆదేశించారని వివరించారు.

తరువాత గ్రామపెద్దలైన వెంకటకృష్ణయ్య, నరసింగాపురం రెడ్డివారి నాధమునిరెడ్డి, గుర్రప్ప ఆచారి మరియు తొండవాడ మొగిలి సుందరరామిరెడ్డి తదితరులను సుందరరాజ కలిసి స్వామివారు తనకు కలలో కనిపించిన విషయాన్ని వివరించి సాయం చేయాలని కోరారు. ఆ సమయంలో ఆలయం మొత్తం ముళ్లపొదలు, చీమలపుట్టలు, విషపు కీటకాలు, పాములతో నిండి గోపురాలు కూలిపోయే స్థితిలో ఉండేది. గ్రామపెద్దల సాయంతో సుందరరాజ ముళ్లపొదలు, చీమలపుట్టలను తొలగించి ఆలయాన్ని పరిశుభ్రం చేశారు. స్వామివారు కలలో సూచించిన విధంగా 1940 జులై 11న ఆషాడ శుద్ధ షష్ఠి రోజున తొలిపూజ చేశారు.

అదేవిధంగా అర్చకుడైన సుందరరాజకు స్వామివారు కలలో కనిపించి చెప్పిన విధంగా తితిదే అప్పటినుండి నిత్యపూజా కైంకర్యాలు నిర్వహిస్తోంది. అలాగే మొదటి పూజను నిర్వహించిన ఆషాడ శుద్ధ షష్ఠి రోజున ”సాక్షాత్కార వైభవం” పేరిట తితిదే ప్రతి ఏడాదీ ఉత్సవం నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాన్ని బ్రహ్మోత్సవాల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తితిదే నిర్వహిస్తుండడం విశేషం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.