అమరావతిలో వైభవంగా శ్రీవారికి స్నపన తిరుమంజనం
అమరావతిలో వైభవంగా శ్రీవారికి స్నపన తిరుమంజనం
ఫిబ్రవరి 02, అమరావతి 2019: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో శ్రీవారి నూతన ఆలయ నిర్మాణానికి భూకర్షణంలో భాగంగా శనివారం ఉదయం స్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. జనవరి 28 నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు టిటిడి ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం విధితమే.
ఇందులో భాగంగా శనివారం ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. అంతకుముందు ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు చతుర్వేద పారాయణం నిర్వహించారు.
అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం(పవిత్రస్నానం) శనివారం శోభాయమానంగా జరిగింది. ఇందులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖనస ఆగమయుక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే పాశురాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఏడు రకాల మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఇందులో రోజా పూలు, సంపంగి, చామంతి, తులసి, గులాబి, మొదలగు ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, శ్రీవారి ఆలయ ఒఎస్డీ శ్రీ పాల శేషాద్రి, ఇతర అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.