శ్రీ పద్మావతి అమ్మవారికి వైభవంగా స్నపనతిరుమంజనం


ISSUED BY TTDs,PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న పుష్పాలంకరణ

తిరుపతి, 2017 నవంబరు 17;తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారికి నిర్వహిస్తున్న స్నపనతిరుమంజనం(పవిత్రస్నానం) ప్రతిరోజూ శోభాయమానంగా జరుగుతోంది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 12.30 నుండి 2.30 గంటల వరకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో శ్రీపాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక వైభవంగా జరిగింది.

ప్రధాన కంకణభట్టర్‌ శ్రీ మణికంఠభట్టార్‌ ఆధ్వర్యంలో ఈ విశేష ఉత్సవం జరుగుతోంది. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను పాంచరాత్ర ఆగమయుక్తంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీప్రశ్నసంహిత మంత్రాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఏడు రకాల మాలలను అమ్మవారికి అలంకరించారు. ఇందులో కురువేరు(వట్టివేరులో ఒకరకం), వట్టివేరు, వివిధ రకాల ఎండు ఫలాలు, మూడు రంగుల రోజా పూలు, లిల్లీపూల మాలలు అమ్మవారికి అలంకరించారు.

ఆకట్టుకున్న ఫల,పుష్ప మండపం :

స్నపనతిరుమంజనం నిర్వహించే శ్రీకృష్ణముఖ మండపంలో ఆపిల్‌, పైనాపిల్‌, ద్రాక్ష, కమలా, సపోటా, మొక్కజొన్న, తదితర విభిన్నరకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలతో ఆకర్షణీయంగా రూపొందించారు. ఈ మండపాన్ని 20 మంది టిటిడి గార్డెన్‌ సిబ్బంది రెండు రోజుల పాటు శ్రమించి నిర్మించారు. బ్రహ్మోత్సవాలలో 3 రోజుల కోసారి పండ్లు, పుష్పాలను మార్చి అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దారు.

భక్తులను విశేషంగా ఆకట్టుకున్న పుష్పాలంకరణ :

శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలోని ధ్వజమండపం, గర్భాలయం, శ్రీకృష్ణస్వామివారి ఆలయం, శ్రీ సుందరనరాజస్వామివారి ఆలయం, వాహనమండపం, ఆస్థానమండపంలలో టిటిడి గార్డెన్‌ విభాగం ఆధ్వర్యంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. దాదాపు 85 మంది సిబ్బంది 3 రోజుల పాటు శ్రమించి సుందరంగా అలంకరించారు. ఇందుకుగాను 3.7 టన్నుల వివిధరకాల సుగంధ, ఉత్తమజాతి పుష్పాలు ఉపయోగించారు.

తులసీ మొక్కలకు భక్తుల నుండి విశేష స్పందన :

శ్రీపద్మావతి అమ్మవారి దర్శనానంతరం బయటకు వచ్చే భక్తులకు టిటిడి ఆటవీ విభాగం ఆధ్వర్యంలో లక్ష్మీ తులసీ మొక్కలను ఆలయం వెలుపల పంపిణీ చేస్తున్నారు. భక్తులు ఎంతో భక్తి భావంతో తులసీ మొక్కలను తీసుకు వెళుతున్నారు. ప్రతి రోజు 1200 తులసీ మొక్కలను భక్తులకు అందిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.