SRI GT BTUs COMMENCES_ శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా ధ్వజారోహణం

Tirupati, 21 May 2018; The annual Brahmotsavams in Sri Govinda Raja Swamy temple in Tirupathi commenced on a religious note on Monday.

Speaking on this occasion, TTD EO Sri Anil Kumar Singhal said, the nine day fete took off on a spiritual note with Dhwajarohanam performed between 9 am and 9:40am in the auspicious Mithuna Lagnam.

He said the important days includes Garuda Seva on May 25, Rathotsavam on May 28 and Chakrasnanam on May 29. TTD has made elaborate arrangements for the celestial fete.

Earlier, during the day, Snapana Tirumanjanam was performed to the deities.

HH Sri Sri Pedda Jeeyar, HH Sri Sri Chinna Jeeyar, Tirupati JEO Sri Pola Bhaskar, Temple DyEO Smt Varalakshmi, AEO Sri Uday Bhaskar Reddy, Suptd Sri Gyana Prakash, Temple Inspector Sri Krishanmurthy and others took part.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా ధ్వజారోహణం

తిరుపతి, 2018 మే 21: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం 9 నుండి 9.40 గంటల మద్య మిథున లగ్నంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. ఆనంతరం శ్రీవారి ఆస్థానం ఘనంగా జరిగింది.

అంతకుముందు శ్రీగోవిందరాజస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్‌, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మూెత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. మిథున లగ్నంలో శ్రీభూ సమేత గోవిందరాజస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఎన్ని దానాలు చేసినా ధ్వజారోహణకార్యంలో గరుడారోహణం చేసిన పుణ్యంతో సాటిరాదని పురాణాలు చెబుతున్నాయి. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మూెత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుంది.

ఈ సందర్భంగా టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, మూలవిరాట్‌తోపాటు వాహనసేవలను భక్తులు సంతృప్తిగా దర్శించుకునేందుకు వీలుగా విస్తృతంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రధానంగా మే 25న గరుడ వాహనం, మే 28న రథోత్సవం, మే 29వ తేదీన చక్రస్నానం జరుగుతాయని వివరించారు. వాహనసేవల సమయంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా పోలీసులతో సమన్వయం చేసుకున్నామన్నారు. వాహనసేవలను భక్తులు తిలకించేందుకు వీలుగా రైల్వేస్టేషన్‌, విష్ణునివాసం, గోవిందరాజస్వామి పుష్కరిణి ప్రాంతాల్లో డిజిటల్‌ స్క్రీన్లు(ఎల్‌ఇడి)లు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ఆలయం, పరిసర ప్రాంతాలను విద్యుద్దీపాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించామన్నారు. క్యూలైన్ల క్రమబద్ధీకరణ కోసం తగినంత మంది శ్రీవారి సేవకులను కేటాయించినట్టు చెప్పారు. భక్తులకు అన్నప్రసాదాలు, వాహన సేవల్లో మజ్జిగ, తాగునీరు పంపిణీ చేస్తున్నట్టు తెలియజేశారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో వాహనసేవల ముందు ఆకట్టుకునేలా నిపుణులైన కళాకారులతో భజనలు, కోలాటాలు, ఇతర సాంస్క తిక కార్యక్రమాలు ఏర్పాటుచేశామన్నారు.

ఉత్సవాల్లో మొదటిరోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 11 నుండి 12 గంటల వరకు కల్యాణమండపంలో స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్లరసాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ జరగనుంది.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, కంకణభట్టార్‌ శ్రీఎ.పి.శ్రీనివాసదీక్షితులు, ఏఈవో శ్రీఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ జ్ఞానప్రకాష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణమూర్తి ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.