శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక శోభ
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక శోభ
ఫిబ్రవరి 25, తిరుపతి, 2019: శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమాల వివరాలిలా ఉన్నాయి.
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మండపంలో ఎస్.వి.సంగీత కళాశాల ఆధ్వర్యంలో ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు మంగళధ్వని, శ్రీ వేంకటేశ్వర వేదిక్ యూనివర్శిటి ఆధ్వర్యంలో ఉదయం 7.00 నుండి 8.00 గంటల వరకు వేద పారాయణం నిర్వహించారు. ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ చక్రవర్తి రంగనాథన్ ధార్మికోపన్యాసం చేశారు. ఇందులో ఆళ్వార్లు వారి జీవిత విశేషాలు, వారు స్వామివారిని ఏవిధంగా సేవించి తరించారో వివరించారు.
సాయంత్రం 4.30 నుండి 6.00 గంటల వరకు కుప్పంకు చెందిన జి.ఎల్.జ్ఞానాంబ బృందం హరికథ పారాయణం చేయనున్నారు. సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్ సేవలో తిరుపతికి చెందిన కె.విశాలక్ష్మి అన్నమయ్య సంకీర్తనలను ఆలపిస్తారు. రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు తిరుపతికి చెందిన ఆర్.ఎస్.ఎస్.శైలేశ్వరి బృందం అన్నమయ్య విన్నపాలు భక్తి సంగీతం వినిపిస్తారు.
అదేవిధంగా తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు హైదరాబాదుకు చెందిన ప్రియమోహన్ బృందం నామసంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.