Sri Kapileswara Swamy Temple Brahmotsavam Begins _ ధ్వజారోహణంతో శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ధ్వజారోహణంతో శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరుపతి, మార్చి 3, 2013 : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5.30 గంటలకు ధ్వజారోహణం కార్యక్రమం ప్రారంభమైంది. అర్చకులు వేదమంత్రాలు పఠిస్తూ ధ్వజస్తంభం వద్ద తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం దంపతులతో ప్రత్యేక పూజలు చేయించారు. 6.51 గంటలకు కుంభ లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి శాస్త్రోక్తంగా ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు.
అనంతరం 7.30 గంటల నుండి 9.30 గంటల వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారికి, శ్రీ కామాక్షి అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. పల్లకీని అధిరోహించిన స్వామి, అమ్మవారు తిరుపతి పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.
సాయంత్రం 6.30 గంటల నుండి 8.30 గంటల వరకు హంస వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు తిరుపతి పురవీధుల్లో విహరించనున్నారు.
ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి రెడ్డెమ్మ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, ఇతర అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.