SRI KRT BRAHMOTSAVAMS CONCLUDES WITH CHAKRASNANAM _ నేత్రపర్వంగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం
నేత్రపర్వంగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం
రుపతి, మార్చి 19, 2013: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన మంగళవారం ఉదయం కపిలతీర్థంలోని పుష్కరిణిలో చక్రస్నానం(అవభృథోత్సవం) నేత్రపర్వంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.
ఈ సందర్భంగా తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం విలేకరులతో మాట్లాడుతూ శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించినట్టు తెలిపారు. తిరుపతి, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఉదయం, రాత్రి వేళ స్వామివారి వాహనసేవల్లో పాల్గొన్నట్టు వివరించారు. ఈ సందర్భంగా ఆలయంలో పండుగ వాతావరణంలో ఏర్పాటుచేసిన రామకోటి లేఖనం, శ్రీమద్రామాయణ గోష్ఠి, మహతి కళాక్షేత్రం, శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటుచేసిన ఆధ్యాత్మిక, భక్తి సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలకు భక్తుల నుండి విశేష స్పందన వచ్చిందని వివరించారు. ఒక్కో ఆలయ బ్రహ్మోత్సవాలకు ఒక్కో ప్రాధాన్యత ఉంటుందని, అందుకే తితిదే అనుబంధ ఆలయాల బ్రహ్మోత్సవాలను ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. బ్రహ్మోత్సవాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన మీడియాకు ఈ సందర్భంగా తితిదే ఈవో కృతజ్ఞతలు తెలిపారు.
తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మార్చి 19 నుండి 28వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఈవో భక్తులకు పిలుపునిచ్చారు.
అంతకుముందు ఉదయం 7.30 నుండి 10.00 గంటల వరకు లక్ష్మణ సమేత సీతారాములవారు పల్లకిలో కపిలతీర్థానికి వేంచేశారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అక్కడ స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, నెయ్యి, పండ్ల రసాలతో అభిషేకాలు అందుకుని ప్రసన్నులయ్యారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. భక్తుల శ్రీరామనామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది.
మధ్యాహ్నం 12.00 గంటలకు స్వామివారు పి.ఆర్ తోటకు వేంచేశారు. సాయంత్రం 5.00 గంటలకు అక్కడినుండి బయలుదేరి తీర్థకట్ట వీధి, కోటకొమ్మల వీధి, కొత్తవీధి మీదుగా శ్రీ కోదండరామాలయానికి చేరుకున్నారు. మధ్యలో శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో ఆస్థానం నిర్వహించారు. రాత్రి 8.15 నుండి రాత్రి 9.30 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం, శ్రీ భాష్యకార్లవారికి యిహల్‌పడి ఆరగింపు నిర్వహించనున్నారు. రాత్రి 9.30 గంటల నుండి 10.30 గంటల వరకు ధ్వజావరోహణంతో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, విజిఓ శ్రీ హనుమంతు, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖరపిళ్లై, ఏఈఓ శ్రీ ప్రసాదమూర్తిరాజు, సూపరింటెండెంట్ శ్రీ సురేష్‌రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ఆంజనేయులు, శ్రీ శేషారెడ్డి, శ్రీ శ్రీనివాసులు ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
”శుభప్రదం”కు విశేష స్పందన
భారతీయ సనాతన ధర్మంలోని మానవీయ, నైతిక విలువలు, ఆర్ష ధర్మాలు, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన ”శుభప్రదం” వేసవి శిక్షణ తరగతులకు విద్యార్థినీ విద్యార్థుల నుండి విశేష స్పందన లభిస్తోందని తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. కపిలతీర్థంలో శ్రీ కోదండరాముని చక్రస్నానం సందర్భంగా మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శుభప్రదం కార్యక్రమానికి ఇప్పటికే నాలుగు వేలకు పైగా దరఖాస్తులు అందినట్టు వెల్లడించారు. దరఖాస్తుల సమర్పణకు మార్చి 31వ తేదీ వరకు గడువు ఉందని, మొత్తం పది వేల దరఖాస్తులు రావచ్చని అంచనా వేస్తున్నామని వివరించారు. జాతి ఔన్నత్యం కోసం సనాతన ధర్మం గురించి బోధించే ఇలాంటి శిక్షణ తరగతులకు తమ పిల్లలను పంపాలని ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. బాలురకు అన్ని కేంద్రాల్లో, బాలికలకు తిరుపతి, హైదరాబాద్, విశాఖపట్టణం కేంద్రాల్లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు ఈవో తెలిపారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.