వైకుంఠ ఏకాదశికి టిటిడి స్థానిక ఆలయాలు ముస్తాబు

వైకుంఠ ఏకాదశికి టిటిడి స్థానిక ఆలయాలు ముస్తాబు

తిరుపతి, 2018 డిసెంబరు 17: డిసెంబరు 18, 19వ తేదీలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం స్థానిక ఆలయాలలో టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో…

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏకాదశి నాడు అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డిసెంబరు 19వ తేదీ ద్వాదశి నాడు ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు స్నపన తిరుమంజనం, ఉదయం 10 నుండి 10.15 గంటల వరకు చక్రస్నానం జరుగనుంది.

శ్రీనివాసమంగాపురంలో …

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 గంటల నుండి 12.30 గంటల వరకు తిరుపల్లచ్చితో శ్రీవారిని మేల్కొలుపుతారు. 12.30 నుండి 3.00 గంటల వరకు మూలవర్లకు తోమాల సేవ, కొలువు తదితర ఏకాంత సేవలను నిర్వహిస్తారు. ఉదయం 3.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 7 నుండి 8 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీవారు ఊరేగనున్నారు. డిసెంబరు 19వ తేదీ ఉదయం 8.00 నుండి 9.30 గంటల వరకు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను నాలుగు మాడ వీధులలో ఊరేగించి, పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా డిసెంబరు 18,19వ తేదీలలో ఆర్జిత కల్యాణోత్సవం సేవ రద్దు చేశారు.

తిరుమల శ్రీవారిని సందర్శించుకోలేని భక్తుల సౌకర్యార్థం శ్రీనివాసమంగాపురంలో వైకుంఠద్వారం ఏర్పాటు చేశారు. అలాగే చలువపందిళ్లు, బారికేడ్లు, క్యూలైన్లు, వాహనాల పార్కింగ్, భక్తులకు సమాచారం తెలిపే ఫ్లెక్సీ బోర్డులను ఏర్పాటు చేశారు. ఎస్వీ మ్యూజిక్ కాలేజీ స్టాప్ ఆధ్వర్యంలో ఉదయం 6 నుండి 6.30 గం.ల వరకు మంగళధ్వని, ఉదయం 6.30 నుండి 7.30 గం.ల వరకు ఎస్వీ హయ్యర్ వేదిక్ విద్యార్థుల ఆధ్వర్యంలో వేద పారాయణం నిర్వహిస్తారు. ఉ.7.30 నుండి 8.30 గంటల వరకు విష్ణు సహస్రనామ పారాయణం, ఉ.8 నుండి 10 గంటల వరకు భక్తి సంగీత కార్యక్రమాలు, ఉ.10 నుండి 11.30 గంటల వరకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ధార్మిక కార్యక్రమాలు, సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు భక్తి సంగీతం, సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు హరికథ జరుగనుంది.

అప్పలాయగుంటలో …

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 3.30 నుండి 4.00 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 4.00 నుండి 5.00 గంటల వరకు మూలవర్లకు తోమాల, కొలువు, అర్చన, విశేష నివేదన నిర్వహిస్తారు. ఉదయం 5.00 నుండి 6.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరగనుంది. ఉదయం 5.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. అనంతరం రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు. డిసెంబరు 19న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 8.00 గంటలకు స్వామి, అమ్మవార్ల ఊరేగింపు, 9.00 గంటలకు స్నపనతిరుమంజనం, ఉదయం 10.00 గంటలకు చక్రస్నానం నిర్వహించనున్నారు.

నారాయణవనంలో …

నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేకువజామున 5 నుండి 6 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.00 గంటల వరకు శ్రీవారి గ్రామోత్సవం, ఆస్థానం నిర్వహించనున్నారు.

నాగలాపురంలో …

నాగలాపురంలోని శ్రీ వేద నారాయణస్వామివారి ఆలయంలో డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని వేకువజామున 3.00 నుండి 4.30 గంటల వరకు తిరుపాల్లచ్చితో స్వామివారిని మేల్కొలిపి, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 5.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఉదయం 9.00 గంటలకు ఉత్సవర్లకు అభిషేకం, సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

అదేవిధంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామాలయం, చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయం, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, పిఠాపురంలోని శ్రీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయం, వాల్మీకిపురంలోని శ్రీపట్టాభిరామ స్వామి ఆలయం, కోసువారిపల్లిలోని శ్రీప్రసన్న వేంకటరమణ స్వామి ఆలయం, బెంగుళూరులోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.