TIRUMALA NAMBI AVATAROTSAVAM IN TIRUMALA ON AUGUST 19_ ఆగస్టు 19న శ్రీ తిరుమలనంబి 1045వ అవతార మహోత్సవం

Tirumala, 18 August 2018: The 1045th Avatarotsavam of the great Sri Vaishnavaite Saint, Sri Tirumala Nambi will be observed in a spiritual way in Tirumala on August 19 under the aegis of Alwar Divya Prabandha Project of TTD. This religious event will take place at Tirumala Nambi Sannidhi located in South Mada Street from 9am onwards.

Tirumala Nambi pioneered “Teertha Kainkarya” to Lord Venkateswara and he was also known as Acharya Purusha, who was one of the five gurus of Sri Ramanujacharya and also his maternal uncle.

Meanwhile on Saturday, Chaturveda Parayanam was rendered by 30 Ritwiks in connection with Tirumala Nambi Avatarotsavam in the Tirumala Nambi temple on Saturday.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఆగస్టు 19న శ్రీ తిరుమలనంబి 1045వ అవతార మహోత్సవం

ఆగస్టు 18, తిరుమల, 2018: ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమలనంబి 1045వ అవతార మహోత్సవం ఆగస్టు 19వ తేదీన తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఘనంగా జరుగనుంది. ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా|| వి.జి.చొక్కలింగం ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

శ్రీవారి భక్తాగ్రేసరులలో ఒకరైన శ్రీ తిరుమలనంబి శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తీర్థ కైంకర్యం ప్రారంభించారు. వీరు భగవద్రామానుజుల వారికి స్వయాన మేనమామ, గురుతుల్యులు. వీరు రామానుజుల వారికి రామాయణ పఠనం చేశారని పురాణాల ద్వారా తెలుస్తోంది.

కాగా ఆచార్య పురుషుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమలనంబికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. తిరుమలనంబి శ్రీవేంకటేశ్వస్వామివారి అభిషేకానికి సంబంధించిన పవిత్రజలాలను తిరుమల ఆలయానికి 8 కి.మీ దూరంలో ఉన్న పాపవినాశం తీర్థం నుండి తీసుకొచ్చేవారు. ఒకరోజు ఆయన పాపవినాశనం నుండి నీటిని కుండలో తీసుకొస్తుండగా సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామివారు తిరుమలనంబి భక్తిని పరీక్షించాలని భావించి ఒక వేటగాని రూపంలో వచ్చి దాహంగా ఉందని, తాగడానికి నీళ్లు కావాలని ఆడిగారు. ఈ పవిత్రజలాలు స్వామివారి ఆభిషేకం కోసమని చెప్పి ఇచ్చేందుకు తిరుమలనంబి తిరస్కరించారు. అంతట వేటగాని రూపంలో ఉన్న స్వామివారు రాయి విసరి కుండకు చిల్లుచేసి నీరు తాగారు. అందుకు తిరుమలనంబి బాధపడుతూ ”వయోభారం కారణంగా నేను తిరిగి అంతదూరం పాపవినాశనం వెళ్లి స్వామివారికి అభిషేకజలం తేవడం సాధ్యంకాదు. అందువల్ల ఈ రోజు నేను స్వామివారికి అభిషేకం చేయలేకపోతున్నా” అని విచారిస్తుండగా అంతలో వేటగాని రూపంలో ఉన్న స్వామివారు ”చింతించకు తాతా నేను నీ పూజకు తప్పకుండా సహాయం చేస్తా” అని తెలిపి తన చేతిలోని విల్లును ఆకాశంలోనికి ఎక్కుపెట్టి బాణం వదిలారు. వెంటనే వినీలాకాశం నుండి ఉరుకుతూ నీటిధార భూమికి వచ్చింది. ”ఇకపై ఈ జలాన్నే నా అభిషేకానికి వినియోగించు” అని ఆ వేటగాని రూపంలో ఉన్న స్వామివారు అద శ్యమయ్యారు. అప్పుడు తిరుమలనంబి సాక్షాత్తు స్వామివారే బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యారని గ్రహించారు. ఆనాటి నుండి నేటి వరకు ఈ తీర్థాన్నే స్వామివారి అభిషేకానికి వినియోగిస్తున్నారు. ఆకాశం నుండి వచ్చినందువల్ల ఈ తీర్థానికి ఆకాశగంగ అని నామధేయం ఏర్పడింది.

తిరుమలనంబి ఆలయంలో చతుర్వేదపారాయణం :

అవతార మహోత్సవాలను పురస్కరించుకుని శనివారంనాడు తిరుమలలోని శ్రీతిరుమలనంబి ఆలయంలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదమంత్రాలను పారాయణం చేశారు. దాదాపు 30 మంది వేదపండితులు పాల్గొన్నారు. టిటిడి ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.