TTD CHAIRMAN, EO REVIEWS ON TTD PROJECTS _ తి.తి.దే ప్రాజెక్టులపై ఛైర్మెన్, ఇ.ఓ.ల సమీక్ష
తి.తి.దే ప్రాజెక్టులపై ఛైర్మెన్, ఇ.ఓ.ల సమీక్ష
తిరుమల, 28 జూలై 2013 : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న అనేక ప్రాజెక్టుల నిర్వహణ, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై తి.తి.దే ఛైర్మెన్ శ్రీ కనుమూరు బాపిరాజు, తి.తి.దే ఇ.ఓ శ్రీ యం.జి.గోపాల్ ఆయా విభాగాధికారులతో ఆదివారం సాయంత్రం తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూసనాతన ధర్మ ప్రచారమే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రాజెక్టులు భవిష్యత్తులో మరింత మెరుగుగా సేవలందించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు.
వాటి సారాంశం –
1 ప్రతి ప్రాజెక్టుపై తి.తి.దే ఎస్.వి.భక్తి ఛానల్లో 15 నిమిషాలపాటు ఆయా ప్రాజెక్టు అధికారులు కూలంకషంగా వివరించి తద్వారా మరింత ప్రచారం కల్పించడం.
2 ఇకపై ప్రతి బోర్డు సమావేశంలోనూ హిందూధర్మ ప్రచారపరిషత్ నిర్వహిస్తున్న మరియు నిర్వహించబోయే కార్యక్రమాలను ప్రతిపాదనల్లో పొందుపరచడం.
3 పుస్తకాల ప్రచురణలపై సంబంధిత గ్రంథకర్తలతో టెలీ కాన్ఫరెన్సు లేదా విడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రచురణ సాధ్యాసాధ్యాలపై వారికి జాప్యం లేకుండా తెలియచెప్పడం.
4 అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల గ్రేడు విధానాన్ని సంగీత నిపుణుల ద్వారా తిరిగి ఎంపిక చేయడం.
5 సప్తగిరి మాస సంచికను సంస్కృతంలో కూడా ముద్రించడం. (తొలుత కొన్ని వ్యాసాలతో ఈ ప్రక్రియను ప్రారంభించడం)
6 శ్రీనివాస కల్యాణాలు నిర్వహించే కల్యాణోత్సవం ప్రాజెక్టు ఇకపై తమ ప్రదేశంలో కల్యాణాల కొరకు అర్జీలు పంపే వారికి సంబంధించిన గ్రామాలకు బృందాలను పంపి వారితో సాధ్యాసాధ్యాలను చర్చించిన పిదప మాత్రమే కల్యాణాలను నిర్వహించాలి. ఒకవేళ ఎవరైనా తి.తి.దే నిబంధనలకు విరుద్ధంగా ప్రజలవద్ద నుండి డబ్బులు వసూలు చేయడం వంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై చట్టపరంగా కేసులు కూడా నమోదు.
7 శ్రీవారి సేవకుల సేవలను తిరుపతిలోకూడా వినియోగించుకోవడానికి ప్రణాళిక రూపకల్పన చేయాలని ఆదేశం.
8 హరివంశ మరియు రాజకైంకర్య ప్రాజెక్టు అధికారులు నిర్ణీకాలం లోపల తమ గ్రంథపరిష్కారాలను పూర్తిచేయాలని ఆదేశం.
9 వివిధ తి.తి.దే ప్రచురణలను పుస్తక రూపంలోనే కాకుండా అదే సమయంలో కంప్యూటీకరణ చేయాలని ఆదేశం.
ఈ కార్యక్రమంలో తిరుపతి జె.ఇ.ఓ శ్రీ పి. వెంకటరామిరెడ్డి, పి.ఆర్.ఓ శ్రీ టి.రవి, హిందూధర్మ ప్రచారపరిషత్ ప్రత్యేకాధికారి శ్రీ బి.రఘునాథ్, సేవల విభాగం ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ శివారెడ్డి, ఇతర ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.