TTD CHAIRMAN INAUGURATES VQC 1 DISPENSARY _ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ – 1లో చికిత్సాలయాన్ని ప్రారంభించిన తితిదే ఛైర్మన్
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ – 1లో చికిత్సాలయాన్ని ప్రారంభించిన తితిదే ఛైర్మన్
తిరుమల, 2012 ఆగస్టు 24: తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో శుక్రవారం తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు నూతన చికిత్సాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ చికిత్సాలయంలో వివిధ మౌలిక వసతులతో కూడిన ఒక ఓ.పి గది, మందుల గది, అత్యవసర వార్డు మొదలైనవి ఉన్నాయని తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు నెలకొన్నప్పుడు భక్తులకు వెనువెంటనే వైద్య సహాయం అందించడానికి ఈ చికిత్సాలయం ఎంతగానో తోడ్పడుతుందని ఆయన అన్నారు. ఈ చికిత్సాలయం రోజుకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. ఇందులో ఒక ఎంబీబీఎస్ డాక్టర్, ఒక మహిళా ఎంఎన్‌ఓ, పురుష ఎంఎన్‌ఓ, ఒక ఫార్మాసిస్ట్ భక్తులకు అందుబాటులో ఉంటారని ఆయన వెల్లడించారు. ఇక్కడ వెంటిలేటర్ సదుపాయాన్ని కూడా కల్పించాలని ఈ సందర్భంగా ఛైర్మన్ వైద్యాధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్‌రావు, తిరుమల అశ్విని ఆస్పత్రి అధీక్షక వైద్యులు డాక్టర్ వికాస్, తిరుపతి సెంట్రల్ హాస్పిటల్ అధీక్షక వైద్యులు డాక్టర్ కుమారస్వామిరెడ్డి, డాక్టర్ కుసుమకుమారి, డాక్టర్ వాణీరావు(అపోలో హాస్పిటల్) తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.