TTD EO RELEASED FOUR PUBLICATIONS OF TTD_ సింహ వాహనసేవలో ఆవిష్క‌రించిన ఆధ్యాత్మిక గ్రంథాలు

Tirumala, 25 September 2017: Four more significant publications of TTD were released on the third day of the Srivari Brahmotsavam by the TTD EO Sri Anil Kumar Singhal during the Simha Vahana at the Vahana mandapam.

The Telugu and Hindu publications brought out by the TTD publications division were: Subashiratnalu (Telugu) by Dr Nassam Narasimhacharya, Geeta Govindam (Telugu) by Pingali Panduranga Rao, Venkateswaraswami ke Avatar (Hindi) by Dr Y Venkataramana Rao and Sri Shankaravatara Charitramu (Telugu) by Sri Yallapragada Venkatasurya Narayanamurti.

Speaking on the occasion the TTD EO said that the publications were aimed at popularizing the glory and significance of Sri Venkateswara and the epics like Geeta Govinda for spreading awareness among the common devotees.He urged the devotees attending Brahmotsavam to get the books sold at subsidized rate.

After the launch TTD EO felicitated the authors and also presented the Lords prasadam to them.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

సింహ వాహనసేవలో ఆవిష్క‌రించిన ఆధ్యాత్మిక గ్రంథాలు

సెప్టెంబర్ 25, తిరుమల 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాల్లో మూడో రోజైన సోమ‌వారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు సింహ వాహనంపై భక్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు. ఈ సందర్భంగా టిటిడి ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన 4 ఆధ్యాత్మిక గ్రంథాలను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు, సివిఎస్‌వో శ్రీ ఆకె.ర‌వికృష్ణ‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా|| తాళ్లూరు ఆంజనేయులు, సబ్‌ ఎడిటర్‌ డా|| నొస్సం నరసింహాచార్యులు, గ్రంథ రచయితలు పాల్గొన్నారు.

సుభాషిత‌ర‌త్నాలు

ఈ గ్రంథాన్ని టిటిడి స‌బ్ ఎడిట‌ర్ డా.. నొస్సం న‌ర‌సింహాచార్య ర‌చించారు. తెలుగు సాహిత్యంలో వెలువ‌డిన తొమ్మిది శ‌త‌కాల నుండి ఆణిముత్యాల వంటి ప‌ద్యాల‌ను ఎన్నుకుని, ఆ ప‌ద్యాల‌కు చ‌క్క‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ సంక‌ల‌నం తెలుగు భాష ఆభ్య‌సిస్తున్న బాల‌బాలిక‌లు మొద‌లు తెలుగు నేర్చిన వృద్ధులంద‌రూ చ‌దువుకోద‌గ్గ‌ది. సుభాషిత ర‌త్నాలు అనే పేరుతో వెలువ‌డిన ఈ పుస్త‌కంలో నీతి, భ‌క్తి చోటుచేసుకున్న రెండు వంద‌ల ప‌ద్యాలు ఉన్నాయి.

గీత గోవిందం (వ్యాఖ్యానం)

ఈ గ్రంథాన్ని శ్రీ పింగ‌ళి పాండురంగారావు ర‌చించారు. గీత‌గోవిందం శృంగారాత్మ‌క‌మైన భ‌క్తిర‌చ‌న‌. సంస్కృత వాఙ్మ‌యానికి చెందింది. జ‌య‌దేవ మ‌హాక‌వి అష్ట‌ప‌దులు అనే ఛంద‌స్సులో ఈ ర‌చ‌న చేశాడు. ఇందులో 24 అష్ట‌ప‌దులున్నాయి. అష్ట‌ప‌దులు గాన‌యోగ్య‌మైన‌వి. భాష సంస్కృత‌మైనా ల‌లిత‌ప‌ద‌సంయుతంగా ప‌ఠ‌న‌గాన‌యోగ్య‌మైన ఈ అష్ట‌ప‌దులు ప్ర‌పంచ ప్ర‌జ‌లంద‌రి చేత మెప్పు పొందుతున్నాయి. రాధాకృష్ణుల రాస‌లీల ఈ అష్ట‌ప‌దుల్లో ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతుంది. జ‌య‌దేవుడు ర‌సావేశంతో పాఠ‌కుల‌ను భ‌గ‌వంతుని ద‌గ్గ‌ర‌కి చేర్చ‌గ‌లిగాడు. అలాంటి ర‌చ‌న‌కు పింగ‌ళి పాండురంగారావు చ‌క్క‌ని తెలుగు వ్యాఖ్యానం స‌మ‌కూర్చాడు.

శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి కె అవ‌తార్ (హిందీ అనువాదం)
ఈ గ్రంథాన్ని డా.. వై.వెంక‌ట‌ర‌మ‌ణ‌రావ్ ర‌చించారు. శ్రీ‌వేంక‌టేశ్వ‌రుడు వ‌క్షఃస్థ‌ల మ‌హాల‌క్ష్మితో కూడి ఈ దివ్య‌క్షేత్రంలో అవ‌త‌రించిన గాథ‌ను తెలియ‌జేసే స‌ర‌ళగ్రంథం ఇది. ఈ పుస్త‌కాన్ని తెలుగులో డా..స‌ముద్రాల లక్ష్మ‌ణ‌య్య రాయగా, దాన్ని హిందీలోకి డా..వై.వెంక‌ట‌ర‌మ‌ణ‌రావ్ అనువ‌దించారు. పూర్వం మ‌హ‌ర్షులు య‌జ్ఞం చేస్తూ నార‌దుని ఆజ్ఞ మేర‌కు ఎవ‌రు గొప్ప దేవుడో తెలుసుకోవ‌డానికి భృగుమ‌హ‌ర్షిని ప్రేరేపిస్తారు. భృగువు స‌త్య‌లోకం, కైలాసం, చివ‌ర‌గా వైకుంఠానికి వెళ్లి వ‌రుస‌గా త్రిమూర్తుల‌ను ప‌రీక్షించి, శ్రీ‌మ‌హావిష్ణువే అంద‌రికంటే గొప్ప‌వాడు అని నిగ్గు తేలుస్తాడు. ఆ క్ర‌మంలో శ్రీ‌మ‌హావిష్ణువు వ‌క్షఃస్థ‌లంపై భృగువు చేసిన పాద‌తాడ‌నానికి శ్రీ‌మ‌హాల‌క్ష్మి అలిగి భూలోకం చేరుకుంటుంది. ఆమెను వెదుకుతూ శ్రీ‌నివాసుడు భూలోకం చేరుకుని, వ‌రాహ‌క్షేత్రంలో స్థిర‌ప‌డ‌తారు. త‌దుప‌రి, శ్రీ‌నివాసుడు ఆకాశ‌రాజు కూతురు శ్రీ ప‌ద్మావ‌తిని వివాహ‌మాడ‌టం, ఆ త‌రువాత శ్రీ‌మ‌హాల‌క్ష్మి అనుగ్ర‌హం కోసం కొల్హాపురంలోను, శుక‌మ‌హ‌ర్షి ఆశ్ర‌మంలోను త‌ప‌స్సు చేసి ఆమెను ప్ర‌త్య‌క్షం చేసుకోవ‌డం, వేంక‌టాచ‌లంలో అర్చామూర్తిగా నిల‌వ‌డం వంటి పురాణ‌గాథ‌నంతా స‌ర‌ళ‌మైన శైలిలోతెలియ‌జేస్తున్న గ్రంథం ఇది.

శ్రీ శంక‌రావ‌తారచ‌రిత‌ము

శ్రీ య‌ఱ్ఱాప్ర‌గ‌డ వేంక‌ట‌సూర్య‌నారాయ‌ణ‌మూర్తి ఈ గ్రంథాన్ని ర‌చించారు. శ్రీ శంక‌ర‌భ‌గ‌వ‌త్పాదులవారిని సాక్షాత్తు ప‌ర‌మ‌శివుని అంశ‌గా చెప్తారు. స‌నాత‌న ధ‌ర్మోద్ధార‌కులైన శంక‌రుల‌వారి కీర్తిచంద్రిక‌లు ప్ర‌పంచ‌మంత‌టా వ్యాపించాయి. వీరు అద్వైత సిద్ధాంత ప్ర‌వ‌ర్త‌కులు. శంక‌రుల వారి జీవిత‌చ‌రిత్ర‌ను య‌ఱ్ఱాప్ర‌గ‌డ వేంక‌ట‌సూర్య‌నారాయ‌ణ‌మూర్తి ఆరుకాండ‌లుగా ర‌చించి వివిధ విష‌యాల‌ను అనుబంధంగా తెలిపారు. తెలుగు సాహిత్యంలో శంక‌రుల వారిని గురించి ఉన్నంత‌లో స‌మ‌గ్రంగా తెలియ‌జేసే గ్రంథ‌రాజ‌మిది. మృదుమ‌ధుర‌మైన శైలిలో, పండిత పామ‌రరంజ‌క‌మైన భాష‌లోపాఠ‌కుల‌ను చ‌దివించేరీతిలో స‌ర‌ళ సుంద‌రంగా ర‌చించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.