UGRA SRINIVASAMURTY PROCESSION IN TIRUMALA ON NOVEMBER 1_ నవంబరు 1న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి ఆస్థానం
Tirumala, 29 Oct,2017: The once in a year procession of Ugra Srinivasamurty will be observed in Tirumala on November 1 on the auspicious occasion of Kaisika Dwadasi.
The idol of ‘Ugra Srinivasamurty’ will be brought out of the sanctum sanctorum of the hill temple only once in a year on this day and taken out in a grand procession around the mada streets encircling the holy shrine before the break of the dawn on a golden palanquin as is the tradition.
Later the priests conducts Asthanam to the deities inside the temple and read out the significance of the festival.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
నవంబరు 1న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి ఆస్థానం
తిరుమల, 2017 అక్టోబరు 29:నవంబరు 1వ తేదీన కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది.
ఈ ఉత్సవ నేపథ్యంలో స్వామివారికి ప్రాత:కాలంలో నిర్వహించే సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. ఆర్జితసేవలైన సహస్ర కళశాభిషేకంసేవను టిటిడి రద్దు చేసింది.
చారిత్రక వివరాలలోనికి వెళితే కైశిక ద్వాదశిని ప్రభోదోత్సవం అని, ఉత్తానద్వాదశి అని కూడా వ్యవహరిస్తారు. వివిధ గ్రంధాల్లో పేర్కొన్న విధంగా స్థితికారుడైన శ్రీమహావిష్ణువును మేల్కొల్పే పర్వదినాన్ని కైశికద్వాదశిగా వ్యవహరిస్తారు. శ్రీమహావిష్ణువు ఆషాఢశుక్ల ఏకాదశినాడు గాఢ నిద్రలోకి వెళ్ళారు. కైశికద్వాదశినాడు ఆయనను మేల్కొల్పు చేయడం రివాజు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైవున్న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి మహోత్సవాన్ని ప్రతిఏటా టిటిడి ఘనంగా నిర్వహిస్తుంది.
కైశికద్వాదశి చారిత్రక నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీనంబదువాన్ అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెలుతుండగా మార్గ మధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తాను తినేస్తానన్నాడు. అందుకు నంబదువాన్ సమాధానంగా తాను ప్రస్తుతం శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్భాదను తీరుస్తానని ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారని చరిత్ర చెబుతుంది. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది.
వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలువబడే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయాతూర్వం, తెల్లవారుఝామున 4.30 గం|| నుండి 5.30 గం||ల లోపు ఆలయ అర్చకులు తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఆలయం లోపల ఉదయం 5.30 గం||ల నుండి ఉదయం 7.30 గం||ల వరకు కైశికద్వాదశి ఆస్థానాన్ని పురాణపారాయణం ద్వారా ఘనంగా నిర్వహిస్తారు. దీనితో సాలకట్ల కైశికద్వాదశి ఉత్సవం పూర్తవుతుంది.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.