తిరుమల శ్రీవారికి చెన్నై గొడుగులు
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
తిరుమల శ్రీవారికి చెన్నై గొడుగులు
సెప్టెంబరు 16, తిరుమల 2018: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి గొడుగులను ఊరేగింపుగా ఆదివారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ శ్రీ ఆర్.ఆర్.గోపాల్‌జి ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టిటిడి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయం ముందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కె.ఇ.కృష్ణమూర్తి చేతుల మీదుగా ఈ గొడుగులను టిటిడి అధికారులకు అందించారు. నాలుగు మాడ వీధుల్లో ఊరేగించిన అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లారు. గరుడసేవలో ఈ గొడుగులను అలంకరించనున్నారు.
ఈ సందర్భంగా శ్రీ కె.ఇ.కృష్ణమూర్తి గత 14 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాల సమయంలో హిందూ ధర్మార్థ సమితి ద్వారా శ్రీవారికి గొడుగులను విరాళంగా అందిస్తున్నారని తెలిపారు.
మొత్తం 11 గొడుగులను తీసుకురాగా సెప్టెంబరు 15న శనివారం తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారికి రెండు గొడుగులు సమర్పించారు. మిగిలిన తొమ్మిది గొడుగులను తిరుమల శ్రీవారి ఆలయంలో అందజేశారు.
ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అగర్వాల్, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి, ఎవిఎస్‌వో శ్రీ కూర్మారావు తదితరులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.