VEENA, BHARATANATYAM AND HARINAMA SANKIRTANA FILL TIRUPATI WITH DEVOTION _ వీణానాదం.. భరతనాట్యం.. హరినామ సంకీర్తనలతో భక్తిమయమైన తిరుపతి

Tirupati, October 13, 2026 ;TTD organised devotional and cultural programmes at various venues in Tirupati on Tuesday as part of the Srivari Navaratri Brahmotsavams.

At Annamacharya Kalamandiram, Sai Prasad Raju presented a veena recital, followed by Bharatanatyam performances by former students of SV College of Music and Dance.

At Mahati, Dr. Surabhi Lakshmi’s team from Hyderabad presented a captivating Kuchipudi Tarangam. At the Sri Kodandaramaswamy Pushkarini, the B. Kondala Rao team performed Annamacharya Sankeertans and Harinama Sankirtana, concluding with “Srinivasa Govinda”.

The programmes showcased India’s rich musical and dance traditions while spreading devotion among devotees.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

వీణానాదం.. భరతనాట్యం.. హరినామ సంకీర్తనలతో భక్తిమయమైన తిరుపతి

అన్నమాచార్య కళామందిరంలో సంగీత, నృత్య ప్రదర్శనలు.. మహతిలో కూచిపూడి తరంగం.. కోదండరామస్వామి పుష్కరిణి వద్ద గోవింద నామస్మరణ

తిరుపతి, 2026 అక్టోబరు 13 ; తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం తిరుపతిలోని వివిధ వేదికలపై టీటీడీ నిర్వహించిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మధురమైన వీణానాదం.. లయబద్ధమైన భరతనాట్యం.. కనువిందు చేసిన కూచిపూడి తరంగం.. మార్మోగిన హరినామ సంకీర్తనలతో తిరుపతి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

అన్నమాచార్య కళామందిరంలో వీణానాదామృతం.. భరతనాట్య వైభవం

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 గంటల నుంచి ఎస్వీ సంగీత, నృత్య కళాశాల పూర్వ విద్యార్థి, హైదరాబాద్‌కు చెందిన శ్రీ సాయి ప్రసాద్ రాజు వీణా వాద్య ప్రదర్శన నిర్వహించారు. శ్రీ యన్నూరి స్వామి మృదంగంపై, శ్రీ సాయి సైలజ తాళ సహకారం అందించారు. గణపతి ప్రార్థనలు, అన్నమాచార్య సంకీర్తనలు, భక్తి సంగీత కీర్తనలను వీణపై మధురంగా పలికిస్తూ శ్రోతలను సంగీతానందంలో ముంచెత్తారు.

అనంతరం రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. ఉమాముద్దుబాల మార్గదర్శకత్వంలో కళాశాల పూర్వ విద్యార్థులు భరతనాట్య ప్రదర్శన నిర్వహించారు. సీ. నరసింహ ఆధ్వర్యంలో చిత్ర, దేవప్రియ, మృదుల, ప్రగసి, జ్యోతిక, మౌల్య, దీపశిఖ వివిధ కీర్తనలకు అభినయంతో కూడిన నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.

పుష్పాంజలి, తిరుమల స్తుతి, ‘శ్రీ విఘ్నరాజంభజే’, ‘తోడయ మంగళం’, ‘ఒకపరి కొకపరి’, ‘అదివో అల్లదివో’, ‘రామా దశరథ రామా’, ‘అమ్మమ్మ యేమమ్మ’, కదన కుతూహలం తిల్లానా వంటి ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి.

మహతిలో అలరించిన కూచిపూడి తరంగ నృత్యం

తిరుపతి మహతిలో హైదరాబాద్‌కు చెందిన డా. సురభి లక్ష్మి నేతృత్వంలోని సురభి అకాడమీ బృందం కూచిపూడి సంప్రదాయ తరంగ నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘అఖిలాండేశ్వరి’, ‘కీర్తింతు నర్తన గణనాథుని’, నారాయణ తీర్థుల ‘నీలమేఘ శరీర’, ‘స్మరతుందా’ వంటి గీతాలకు కళాకారులు లయబద్ధమైన నృత్యాభినయాన్ని ప్రదర్శించారు.

టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సప్తగిరి మాసపత్రిక సీనియర్ ఉపసంపాదకురాలు డా. అల్లాడి సంధ్య, ప్రాజెక్టు సిబ్బంది, సంగీతాభిమానులు, భక్తులు వీక్షించారు.

కోదండరామస్వామి పుష్కరిణి వద్ద హరినామ సంకీర్తన

శ్రీ కోదండరామస్వామివారి పుష్కరిణి వద్ద టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలానికి చెందిన శ్రీ బి. కొండలరావు బృందం, శ్రీ అచ్యుత భజన మండలి నేతృత్వంలో హరినామ సంకీర్తన నిర్వహించింది.

అన్నమయ్య సంకీర్తనలు, శ్రీరామ, శ్రీకృష్ణ భక్తిగీతాలు, హరినామ స్మరణతో భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తారు. ‘ఏమని పొగడుదుమే’, ‘చూడరమ్మ సతులార’, ‘తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు’, ‘కట్టేదుర వైకుంఠము కాణాచయిన కొండ’ వంటి అన్నమయ్య సంకీర్తనలను ఆలపిస్తూ భక్తి భావాన్ని చాటిచెప్పారు.

చివరగా ‘శ్రీనివాస గోవిందా.. భక్తవత్సలా గోవిందా..’ అంటూ గోవింద నామసంకీర్తనతో కార్యక్రమాన్ని ముగించారు.

భక్తి.. సంగీతం.. నృత్యం.. సంస్కృతుల సమ్మేళనం

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచడంతోపాటు అన్నమయ్య సంకీర్తనల మాధుర్యాన్ని, భారతీయ శాస్త్రీయ సంగీత, నృత్య సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పాయి. వీణానాదం నుంచి గోవింద నామస్మరణ వరకు ప్రతి కార్యక్రమం తిరుపతిలో భక్తి పరిమళాలను వెదజల్లింది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.