“VENUGOPALASWAMY” GRACES DEVOTEES ON KALPAVRIKSHA VAHANAM_ కల్పవృక్ష వాహనంపై శ్రీ వేణుగోపాలస్వామి అవతారంలో సిరుల తల్లి

Tiruchanur, 18 November 2017: Goddess Padmavathi Devi as Venugopala Swamy graced the pilgrims on the Divine Wish Fulfilling Tree-Kalpavriksha Vahanam on Fourth Day morning on Saturday as a part of the nine days Karthika Brahmotavams at Tiruchanoor.

Among the Dasavataras, one of the most interesting incarnations of Lord is Krishna Avatara. Especially as Venugopala Swamy, Lord mesmerizes everyone with his expertise of playing the wind instrument flute and take care of the cowherd. The same was portrayed by Goddess who donned in the avatar of “Sri Venugopala Swamy” playing the flute on the celestial Kalpavriksha Vahanam.

The devotees attended in large numbers to take a glimpse of Goddess on this unique vahanam as it is believed that those who take part in Kalpavriksha Vahanam will have their all good wishes fulfilled.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కల్పవృక్ష వాహనంపై శ్రీ వేణుగోపాలస్వామి అవతారంలో సిరుల తల్లి

తిరుపతి, 2017 నవంబరు 18తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు శనివారం ఉదయం అమ్మవారు శ్రీవేణుగోపాలుడి రూపంలో కల్పవృక్ష వాహనంపై భక్తులను అనుగ్రహించారు. అమ్మవారు వేణుగానం చేస్తూ పశుపక్ష్యాదులకు రక్షణగా ఉన్నట్లుగా తెలిపేందుకు ఆవు, కొంగ, ఏనుగు, గుర్రం బొమ్మలు
వాహనసేవలో దర్శనం ఇచ్చాయి.

అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవీగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఉదయం 8.00 నుండి 9.30 గంటల వరకు వాహనసేవ కోలాహలంగా సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

పాలకడలిని అమృతం కోసం మథించినవేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఆకలిదప్పుల్ని తొలగించి, పూర్వజన్మస్మరణను ప్రసాదించే ఈ ఉదారదేవతావృక్షం అన్ని కోరికలనూ తీరుస్తుంది. ఖడ్గాన్ని, యోగదండాన్ని ధరించే గోపకిశోరుడిలా గోసంపదను పరిరక్షించే మంగళదేవత అలమేలుమంగ. మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించాడు. కోర్కెలను ఈడేర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలమేలుమంగ ఆశ్రితభక్తులకు లేముల్ని తొలగించే పరిపూర్ణశక్తి.

ఈ సందర్భంగా తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ ఈవో ఆదేశాలమేరకు అమ్మవారి వాహనసేవలలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి కళాబృందాలు విచ్చేసి ప్రదర్శనలు ఇస్తున్నట్లు తెలిపారు. కర్ణాటక, నుండి 60 మంది, తమిళనాడు నుండి 60 మంది కళాకారులు వివిధ కళారూపాల ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని వివరించారు. అదేవిధంగా నవంబరు 23వ తేదీ పంచమితీర్థనికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

మధ్యాహ్నం 12.30 గంటల నుండి 2.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. కాగా సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.

అలాగే రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు హనుమంత వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు. హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్యభక్తుడు. త్రేతాయుగంలో శ్రీవారు శ్రీరాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మి అలమేలుమంగమ్మ సీతగా మిథిలానగరంలో అవతరించి, స్వామిని వివాహమాడింది. ఆ సీతామాత కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన ఆంజనేయుని కోరికను తీర్చడానికా అన్నట్టు అలమేలుమంగ బ్రహ్మోత్సవాలలో హనుమంతున్ని వాహనంగా చేసుకుంది.

వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ దంపతులు, చంద్రగిరి ఎమ్‌ఎల్‌ఏ శ్రీ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సివిఎస్వో శ్రీఆకే.రవికృష్ణ, ఆదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ ప్రత్యేక శ్రేణి ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమునిరత్నంరెడ్డి, వి.జి.వో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, ఏఈవో శ్రీరాధాకృష్ణ, ఎవిఎస్వో శ్రీ పార్థసారథిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.